బాలీవుడ్‌లో అత్యంత పాపులర్ టాక్ షోలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ‘కాఫీ విత్ కరణ్’ ఇకపై ప్రేక్షకులకు కనిపించకుండా పోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ స్వయంగా షో ముగింపుపై కీలక ప్రకటన చేశారు. దీంతో అభిమానుల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
2004లో ప్రారంభమైన ‘కాఫీ విత్ కరణ్’ ఇప్పటివరకు ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలకుపైగా బాలీవుడ్ సినీ ప్రముఖులతో కరణ్ జోహార్ చేసిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు ఈ షోలో 161 ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి.
ప్రస్తుతం తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్‌లో కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇదే చివరి సీజన్‌గా ఉండబోతున్నట్లు కరణ్ జోహార్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈ సీజన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇక చివరి సీజన్‌లో పలువురు టాప్ సెలబ్రిటీలు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తదితరులు ఈ సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సినీ తారల వ్యక్తిగత, కెరీర్ విషయాలపై కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలు ఈ షోకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. పలుమార్లు ఈ కార్యక్రమంలోని వ్యాఖ్యలు, చర్చలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇంతకాలం ప్రేక్షకులను అలరించిన ‘కాఫీ విత్ కరణ్’కు చివరి సీజన్‌తో తెరపడనుండటంతో బాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
also read: రాజమౌళి మాటలు విని కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎమోషనల్ మూమెంట్!
