దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భర్త సౌరభ్‌ను హత్య చేసిన కేసులో అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను మీరట్ జిల్లా కోర్టు దోషులుగా నిర్ధారించింది. సుమారు 13 నెలల పాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా ఈ మేరకు తీర్పు వెలువరించారు.
దర్యాప్తు వివరాల ప్రకారం.. సౌరభ్ హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని ప్లాస్టిక్ డ్రమ్‌లో ఉంచి, సిమెంట్‌తో మూసివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ‘బ్లూ డ్రమ్ హత్య కేసు’గా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ కేసులో నిందితులపై ప్రాసిక్యూషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరింది.
అయితే దోషులుగా నిర్ధారించిన అనంతరం శిక్ష విషయంలో కోర్టు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నిందితులకు ఎలాంటి శిక్ష విధించాలనే అంశంపై కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది. దీంతో శిక్షపై కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
also read: విషాదాంతం.. పురుగుల మందు తిని చెరువులో దూకిన ప్రేమ జంట
