క్రైమ్ మిర్రర్ : తమిళనాడులో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నైలోని చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జిలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి త్రిష తన తల్లితో కలిసి హాజరుకావడంతో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఏర్పాటు చేసిన ముందు వరుసలో త్రిషకు స్థానం కల్పించారు. ఆమె ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చొని వారితో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. త్రిష హాజరైన విషయం కార్యక్రమానికి వచ్చిన పలువురి దృష్టిని ఆకర్షించింది. వేడుకల ప్రాంగణంలో ఆమెను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు.
మరోవైపు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి విజయ్ శనివారం ఫోర్ట్ సెయింట్ జార్జికి చేరుకున్నారు. ఆయనకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం విజయ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులను ప్రభుత్వం సత్కరించింది. ప్రజా సేవలో ప్రతిభ కనబరిచిన పలువురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసు సిబ్బందికి ముఖ్యమంత్రి విజయ్ పురస్కారాలు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిని అభినందించిన సీఎం.. ప్రజలకు అంకితభావంతో సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఫోర్ట్ సెయింట్ జార్జిలో జరిగిన ఈ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాగాయి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పురస్కార గ్రహీతలు, ప్రత్యేక ఆహ్వానితులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో నటి త్రిష హాజరు కావడం, సీఎం విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కూర్చోవడం కార్యక్రమానికి అదనపు ఆకర్షణగా మారింది. త్రిష రాకతో వేడుకల ప్రాంగణంలో సందడి నెలకొంది.
also read : అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నలుగురు మృతి, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతు
