క్రైమ్ మిర్రర్ : దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో దర్యాప్తు మరింత ముందుకు సాగనుంది. ఈ కేసులో అదనపు విచారణ చేపట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు ఇంకా బయటపడని కీలక విషయాలపై సీబీఐ దృష్టి సారించనుంది. పేపర్ లీక్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ప్రశ్నపత్రం ఎవరెవరి చేతులు మారింది? లీక్ ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలు ఎలా సాగాయి? ఇందులో మరికొందరి ప్రమేయం ఉందా? వంటి అంశాలను తెలుసుకునేందుకు సీబీఐ దర్యాప్తును విస్తరించనుంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను విశ్లేషించడంతో పాటు అనుమానితుల పాత్రపైనా అధికారులు మరింత లోతుగా విచారణ జరపనున్నారు.
ఈ కేసులో సీబీఐ ఇప్పటికే 13 మంది నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. దాదాపు 20 వేల పేజీలకు పైగా ఉన్న ఈ చార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షులను ప్రస్తావించినట్లు నివేదికలు వెల్లడించాయి. దర్యాప్తులో భాగంగా ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన వ్యక్తులు, మధ్యవర్తులు, కోచింగ్ సంస్థలతో సంబంధాలపై అధికారులు ఆధారాలు సేకరించారు. ప్రశ్నపత్రానికి ముందస్తుగా యాక్సెస్ ఎలా లభించింది, దానిని విద్యార్థులకు ఎలా చేరవేశారు అనే అంశాలపై కూడా సీబీఐ దృష్టి పెట్టింది.
ఇక కోర్టులో నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఐకి మరింత దర్యాప్తు చేసేందుకు అనుమతి లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా లభించిన ఆధారాల ఆధారంగా అవసరమైతే తదుపరి దశలో అనుబంధ నివేదిక లేదా అదనపు చార్జ్‌షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో అసలు కుట్ర ఎక్కడ మొదలైంది, దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, లీకైన ప్రశ్నపత్రం ద్వారా ఎంతమందికి ప్రయోజనం చేకూరింది అనే అంశాలపై సీబీఐ దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
also read : జంట హత్యల వెనుక పోలీస్ కానిస్టేబుల్.. రూ.3 లక్షల అప్పు వివాదమే కారణం
