Homeతెలంగాణనాగార్జున బిగ్ అనౌన్స్‌మెంట్.. కొత్త రైటర్లకు బంపర్ ఆఫర్...!

నాగార్జున బిగ్ అనౌన్స్‌మెంట్.. కొత్త రైటర్లకు బంపర్ ఆఫర్…!

Crime Mirror, Latest Updates: టాలీవుడ్ కింగ్ నాగార్జున నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన తాజాగా కొత్త కథలు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిభ ఉన్న కొత్త రచయితలకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాగార్జున వెల్లడించారు. మంచి కథతో వచ్చే రచయితల కథలను తన టీమ్ పరిశీలిస్తుందని, నచ్చిన కథలను తన వరకు తీసుకొస్తే తాను స్వయంగా వింటానని తెలిపారు.

అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సంస్థ భవిష్యత్ ప్రణాళికలపై నాగార్జున పలు విషయాలను వెల్లడించారు. తమ సంస్థ నుంచి ఇకపై వరుసగా సినిమాలు రాబోతున్నాయని తెలిపారు. కొత్త కథలు, విభిన్నమైన ఆలోచనలతో వచ్చే రచయితలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీంతో సినీ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టాలని చూస్తున్న రచయితలు, ఫిల్మ్‌మేకర్లకు అన్నపూర్ణ స్టూడియోస్ మంచి వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వరుస సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. ఇప్పటికే అఖిల్ నటించిన లెనిన్ సినిమాను విడుదల చేసిన సంస్థ.. ప్రస్తుతం పళ్ళ బురుసు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.

అనంతరం రంభ, ఊర్వశి, మేనక సినిమాను విడుదల చేయనున్నట్లు నాగార్జున తెలిపారు. మరో రెండు సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయని వెల్లడించారు. వీటితో పాటు నాగార్జున ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం కింగ్ 100 కూడా రానుంది. దీంతో రాబోయే రోజుల్లో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వరుసగా సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ విభాగంలోనూ అన్నపూర్ణ స్టూడియోస్ మరింత దూకుడు పెంచుతోంది. అక్కినేని నాగేశ్వరరావు కాలంలో అనుసరించిన డిస్ట్రిబ్యూషన్ విధానాన్ని తిరిగి తీసుకొస్తున్నట్లు నాగార్జున తెలిపారు. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలను ప్రారంభించామని, అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. స్టూడియోను కేవలం లీజుకు ఇచ్చి ఆదాయం పొందడం కాకుండా.. సినీ పరిశ్రమకు తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాల నిర్మాణాన్ని పెంచుతున్నట్లు తెలిపారు.

ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పళ్ళ బురుసు ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించే ఈ సినిమా.. నాగార్జున తల్లి అన్నపూర్ణమ్మ పుట్టినరోజైన ఆగస్టు 14న విడుదల కానుండటం ప్రత్యేకతగా నిలిచింది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు