Homeక్రైమ్ఏడాది క్రితమే పెళ్లి.. ఇంతలోనే విషాదాంతం

ఏడాది క్రితమే పెళ్లి.. ఇంతలోనే విషాదాంతం

క్రైమ్ మిర్రర్ : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిచెందగా, కొద్దిసేపటికే భర్త కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాతతుంగపాడుకు చెందిన కమిడి లక్ష్మణరావు (35) పోలియో కారణంగా రెండు కాళ్లు పనిచేయని స్థితిలో ఉన్నారు. గ్రామంలో ఔషధాలు, ఫ్యాన్సీ వస్తువుల దుకాణం నిర్వహించేవారు. అదే గ్రామానికి చెందిన శ్యామల (31)ను ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. శ్యామల మానసిక దివ్యాంగురాలని పోలీసులు తెలిపారు. దంపతులకు ప్రభుత్వం నుంచి కలిపి నెలకు సుమారు రూ.12 వేల పింఛను అందుతున్నట్లు సమాచారం.

కొన్ని నెలల క్రితం లక్ష్మణరావు తల్లి మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన మానసికంగా తీవ్రంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో శ్యామల మృతి చెందగా, అనంతరం లక్ష్మణరావు కూడా మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆదివారం ఉదయం 9 గంటలు దాటినా ఇంట్లో ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా దంపతులు ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సెల్ఫీ వీడియోలో కీలక సమాచారం

సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం ఉత్తర మండల డీఎస్పీ సీహెచ్. జీవన, సీఐ ఎస్. ప్రసన్న వీరయ్య గౌడ్ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. లక్ష్మణరావు మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో సెల్ఫీ వీడియో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన తల్లి పదేపదే గుర్తుకు వస్తోందని, ఆమె లేని బాధతో తాను తీవ్రంగా కలత చెందుతున్నానని లక్ష్మణరావు వీడియోలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. తాను లేకపోతే భార్యను చూసుకునే వారు ఎవరూ ఉండరనే ఆందోళనను కూడా వీడియోలో వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఆరు నెలల క్రితం భూమి విక్రయం ద్వారా వచ్చిన డబ్బులో రూ.25 లక్షలను తన అన్న తీసుకోవాలని కూడా వీడియోలో పేర్కొన్నట్లు సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ ఘటన జరిగిందని వీడియోలో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు.

దర్యాప్తు కొనసాగింపు

శ్యామల చేతి మణికట్టు వద్ద గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మణరావు ఇంట్లోనే మృతి చెందినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. మృతుడి సోదరుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫీ వీడియో, ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడాది క్రితమే వివాహం చేసుకున్న దంపతులు మృతి చెందడంతో పాతతుంగపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
also read : రాజ్‌గఢ్‌లో ఘోర విషాదం.. కాల్వలో కొట్టుకుపోయిన వాహనం.. 9 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు