హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతోపాటు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 టీపీఎస్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికే తొలి మోడల్ పాఠశాలగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ఏర్పాటు చేసిన స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్య అందించేలా సదుపాయాలు కల్పించారు.తాజాగా మరో 95 పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. వీటి నిర్మాణానికి మొత్తం రూ.928 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో పాఠశాలకు భూమి, భవన పరిమాణం, మౌలిక సదుపాయాలను బట్టి సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ఖర్చు కానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అంచనాలు రూపొందించి పాఠశాల విద్యాశాఖకు పంపించారు.95 పాఠశాలల నిర్మాణాలకు అవసరమైన పరిపాలనా అనుమతుల కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం ఉత్తర్వులు వెలువడితే టెండర్ల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read:UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్‌న్యూస్!
ముఖ్యంగా 2027-28 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో టీపీఎస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యం పెరిగింది.ఈ పాఠశాలలకు అవసరమైన నిధుల్లో 70 శాతం, అంటే సుమారు రూ.650 కోట్లను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణం ద్వారా సమకూర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించనున్నారు. విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏఐఐబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి భారీగా రుణాలు సమీకరించే ప్రణాళికలో భాగంగానే ఈ నిధులను వినియోగించనుంది. రుణం అందడంలో ఆలస్యం ఏర్పడినా పనులు ఆగిపోకుండా రాష్ట్ర నిధులతో తొలిదశ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఏఐఐబీ తరఫున కన్సల్టెన్సీ ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటిస్తూ సంబంధిత అధికారులతో ప్రాజెక్టు అమలు, మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రమాణాలపై చర్చలు జరుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.టీపీఎస్‌లను కేవలం పాఠశాల భవనాలుగా కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనువైన క్యాంపస్‌లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:మహిళా ఎస్సైతో అనుచిత ప్రవర్తన కేసు: వైసీపీ నేత రవికుమార్ అరెస్ట్
కనీసం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించేలా మౌలిక వసతులు కల్పించనున్నారు. తరగతి గదులతోపాటు డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, లైబ్రరీలు, ఆధునిక సైన్స్ ల్యాబ్‌లు, క్రీడా మైదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన వసతులు, రవాణా సౌకర్యాలను కల్పించనున్నారు. ఆరుట్ల టీపీఎస్‌లో ఇప్పటికే ఆధునిక తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాసులు, క్రీడా వసతులు, ఉచిత రవాణా వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు.విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించడంతోపాటు పాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే అచ్చంపేట, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు రెండేసి టీపీఎస్‌లు మంజూరు కాగా.. గజ్వేల్‌కు కూడా పాఠశాలను కేటాయించారు. ఆరుట్లలో ప్రారంభమైన తొలి టీపీఎస్ నమూనాగా మిగిలిన పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 100 టీపీఎస్‌ల ఏర్పాటుతో ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంచి, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది
