-
మూడు రాష్ట్రాలను కలుపుతూ ఒకసారి కొత్త మార్గం
-
హైదరాబాద్- అమరావతి- చెన్నై మధ్య 760 కిలోమీటర్ల కొత్త ప్రతిపాదిత ప్రాజెక్ట్
-
దారి పొడవునా 18 అధునాతన రైల్వే స్టేషన్లు
-
కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దక్షిణ భారతదేశంలో రవాణా రంగంలో సరికొత్త అధ్యయనం. మూడు రాష్ట్రాల రాజధానులకు సంబంధించి అనుసంధానించే ప్రత్యేక బుల్లెట్ రైలు కారిడార్ రూట్ మ్యాప్ సిద్ధమయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి, తమిళనాడు రాజధాని చెన్నై ను కలుపుతూ.. బుల్లెట్ రైలు కారిడార్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 760 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ మూడు రాష్ట్రాల రాజధానులను అనుసంధానించనుంది. గంటకు 300 కిలోమీటర్ల కు పైగా వేగంతో ప్రయాణించే ఈ బుల్లెట్ రైలు ప్రయాణంతో సమయంతో పాటు భారం గణనీయంగా తగ్గిపోనుంది.
-
మూడు రాష్ట్రాల్లో కొత్త రైల్వే స్టేషన్లు..
మూడు రాష్ట్రాలను కలుపుతూ ఈ బుల్లెట్ రైలు కారిడార్ పొడవున 18 అధునాతన రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ సరిహద్దుల్లో హైదరాబాద్, శంషాబాద్, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్, హాలియా, వాడపల్లి మీదుగా ఈ కారిడార్ సాగనుంది. ఏపీ సరిహద్దుల్లోకి ప్రవేశించాక దాచేపల్లి, రాజధాని అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, గూడూరు తో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి మార్గాన్ని కూడా కలపనుంది. ఆపై తమిళనాడులోని తిరువల్లూరు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా చెన్నై సెంట్రల్ వరకు ఈ మార్గం విస్తరిస్తుంది.
-
ఆర్థిక రంగానికి ఊతం..
ఇది కేవలం రైల్వే రవాణా మార్గం మాత్రమే కాదు. దక్షిణ భారతదేశ ఆర్థిక రంగానికి సరికొత్త గేమ్ చేంజర్ గా నిలవనుంది. శంషాబాద్ విమానాశ్రయం, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, ఏపీ రాజధాని అమరావతి, పరిశ్రమల హబ్ చెన్నై, అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని ఒకే హై స్పీడ్ నెట్వర్క్ కిందకు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం. పర్యాటకంతో పాటు టెంపుల్ టూరిజం, ఐటీ, వ్యాపార లావాదేవీలు, సరకు రవాణా రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. దక్షిణ భారత దేశంలోని ప్రధాన రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయి.
-
త్వరలో డిపిఆర్..
ప్రస్తుతం కేంద్ర రైల్వే శాఖ ఈ ప్రత్యేక కారిడార్ పై దృష్టి పెట్టింది. జాతీయ రైల్వే ప్రాజెక్టుల సర్వేల్లో భాగమైన ఈ హై స్పీడ్ కారిడార్ ఫీజిబులిటీ సర్వే పూర్తికాగానే డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ రూపకల్పన ప్రక్రియ వేగవంతం కానుంది. కేంద్ర రైల్వే శాఖ దేశవ్యాప్తంగా ఏడు హై స్పీడ్ రైలు కారిడార్లు ఏర్పాటు చేయాలనుకుంటోంది. అందులో ఇది ఒక కారిడార్. మూడు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానతలను తొలగించి.. మెట్రో నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచడంతో ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ గా నిలవనుంది.
