Homeసినిమాఐదేళ్ల ఎదురుచూపులకు తెర.. వరుణ్ తేజ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఐదేళ్ల ఎదురుచూపులకు తెర.. వరుణ్ తేజ్ విజయంపై నాగబాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ఎట్టకేలకు భారీ విజయం దక్కింది. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయన.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్-కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. సినిమా విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. దీంతో ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఓపెనింగ్‌గా నిలిచింది.

ఈ విజయంతో వరుణ్ తేజ్ అభిమానుల్లో ఆనందం నెలకొనగా.. ఆయన తండ్రి, నటుడు నాగబాబు మాత్రం మరింత భావోద్వేగానికి గురయ్యారు. కొడుకు గత కొన్నేళ్లుగా ఎదుర్కొన్న ఒడిదుడుకులను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ సందేశాన్ని పంచుకున్నారు.

వరుణ్ కెరీర్‌లో వరుస పరాజయాలు వచ్చిన సమయంలో అతడు పడిన బాధను తాను దగ్గరుండి చూశానని నాగబాబు పేర్కొన్నారు. విజయాలు దూరమైనా.. తన ప్రయత్నాన్ని మాత్రం వరుణ్ ఎప్పుడూ ఆపలేదని చెప్పారు. ఎదురైన నిరాశను బయటకు వ్యక్తం చేయకుండా తనలోనే దాచుకుని ముందుకు సాగాడని తెలిపారు.

తండ్రిగా ఆ సమయంలో కొడుకుకు అండగా ఉన్నప్పటికీ, అతడి కెరీర్ విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని నాగబాబు స్పష్టం చేశారు. గతంలో వచ్చిన విజయాలు, వైఫల్యాలకు వరుణ్ ఎంతవరకు బాధ్యుడో.. ఇప్పుడు వచ్చిన ఈ సక్సెస్‌కు కూడా పూర్తి క్రెడిట్ అతడికే చెందుతుందని పేర్కొన్నారు.

ఐదేళ్లుగా కొనసాగిన పోరాటం తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారాయని నాగబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం వరుణ్ తేజ్ కష్టం, సహనం, పట్టుదలకు దక్కిన ప్రతిఫలమని కొనియాడారు.

“కంగ్రాట్స్ బంగారు.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది” అంటూ కొడుకుపై తన ప్రేమను, గర్వాన్ని వ్యక్తం చేశారు.

అదే సమయంలో ‘కొరియన్ కనకరాజు’ విజయానికి కారణమైన దర్శకుడు మేర్లపాక గాంధీ, నటుడు సత్య, హీరోయిన్ రితికా నాయక్, నిర్మాత రాజీవ్, సంగీత దర్శకుడు తమన్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ నాగబాబు అభినందనలు తెలిపారు. కథపై నమ్మకంతో మొత్తం టీమ్ ఒకే లక్ష్యంతో పనిచేయడం వల్లే ఈ స్థాయి విజయాన్ని అందుకోగలిగారని ప్రశంసించారు.

వరుణ్ తేజ్‌కు వచ్చిన ఈ విజయంతో మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ సక్సెస్.. ఆయన కెరీర్‌కు కొత్త ఊపునిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

also read: కళ్లముందే ఫోన్ చోరీ.. ధైర్యంగా దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన కవలలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు