క్రైమ్ మిర్రర్ : జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మందస ఏజెన్సీ పరిధిలోని పాతకోటలో వ్యవసాయ పనుల్లో ఉన్న వారిపై పిడుగు పడటంతో ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కట్ట సుమిద్రి, సవర జోరాగా గుర్తించారు. బాధితులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనతో తీవ్రంగా గాయపడిన నలుగురిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పిడుగుపాటు ఘటనతో పాతకోటలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అల్పపీడనం ప్రభావంతో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. శ్రీకాకుళం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వర్షం, ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు వీలైనంత వరకు సురక్షితమైన భవనాల్లో ఉండాలని సూచించారు.
also read : వైద్య విద్యార్థిని ప్రియాంక కేసు- ‘హత్యాయత్నం’గా నమోదు చేయాలంటూ తండ్రి ఫిర్యాదు
