Homeఅంతర్జాతీయంఅమెరికా వైఖరి మారే వరకు హర్మూజ్‌ జలసంధి తెరవం : ఇరాన్‌

అమెరికా వైఖరి మారే వరకు హర్మూజ్‌ జలసంధి తెరవం : ఇరాన్‌

క్రైమ్ మిర్రర్ : అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. అమెరికా తన విధానాన్ని మార్చుకునే వరకు హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహమ్మద్‌-బఘేర్‌ జోల్ఘదర్‌ స్పష్టం చేశారు. తన రాజీనామాపై వార్తలు వచ్చిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు. అమెరికా తన వైఖరిని మార్చుకోవాలంటే ఇరాన్‌, దాని మిత్రదేశాలపై బెదిరింపులు, సైనిక చర్యలను నిలిపివేయాలని జోల్ఘదర్‌ డిమాండ్‌ చేశారు. అలాగే నౌకా దిగ్బంధాన్ని తొలగించి, ఇరాన్‌పై కొనసాగుతున్న ఒత్తిళ్లను తగ్గించాలని పేర్కొన్నారు. ఇరాన్‌ ముందుకు తెచ్చిన డిమాండ్లలో పలు అంశాలు ఉన్నాయి. తమ దేశంపై భవిష్యత్తులో ఎలాంటి సైనిక బెదిరింపులు ఉండకూడదని, యుద్ధాన్ని పూర్తిగా ముగించి సైనిక చర్యలకు స్వస్తి పలకాలని కోరింది. అలాగే తమకు చెందిన ఆస్తులను విడుదల చేయడంతో పాటు విధించిన ఆంక్షలను తొలగించాలని డిమాండ్‌ చేసింది.

యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించాలన్న ఇరాన్‌

ఇటీవలి ఘర్షణల్లో తమకు జరిగిన నష్టాలకు అమెరికా పరిహారం చెల్లించాలని కూడా ఇరాన్‌ కోరింది. నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం తమ ప్రధాన డిమాండ్లలో ఉన్నాయని జోల్ఘదర్‌ తెలిపారు. చర్చల ద్వారానైనా, యుద్ధ పరిస్థితుల్లోనైనా ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ తమ వైఖరి నుంచి వెనక్కి తగ్గబోదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇరాన్‌ తాజాగా చేసిన డిమాండ్లపై అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత కొనసాగుతాయా? అనే అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
also read : పైలట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్.. చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

తాజావార్తలు