సోషల్ మీడియా పరిచయాలను ఉపయోగించి యువకులను మోసం చేసిన ఓ మహిళ కథ ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ పరిచయాలను నమ్మిన పలువురు యువకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, పల్లవి సింగ్ రాజ్పుత్ అనే మహిళ టిండర్ వంటి డేటింగ్ యాప్లు, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా పురుషులతో పరిచయం పెంచుకునేది. మొదట స్నేహంగా మాట్లాడి, ఆ తర్వాత నమ్మకం సంపాదించి, వ్యక్తిగతంగా దగ్గరవుతుండేది.
సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత, బాధితులతో కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలను ఆమె తన వద్ద ఉంచుకునేది. తరువాత అవే ఆధారాలుగా చూపిస్తూ డబ్బులు డిమాండ్ చేసేదని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం, హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసుల్లో ఇరికిస్తామని బెదిరించేదని బాధితులు పేర్కొన్నారు.
ఇలా పలువురిని లక్ష్యంగా చేసుకుని ఆమె సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కొంతమందిపై కేసులు నమోదు చేసి, వారిని జైలుకు పంపించిన ఘటనలు కూడా బయటపడ్డాయి.
పరిచయాలను కొనసాగించడానికి ఆమె వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించిందని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఆమెకు సహకరించినట్లు సమాచారం.
ఇటీవల ఈ మహిళకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వాటిలో భారీ మొత్తంలో నగదు కట్టలు కనిపించడం, అలాగే ఆయుధంతో ఉన్న దృశ్యాలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
also read: వర్కింగ్ ప్లేస్ లో వేధింపులు- ఆత్మహత్య చేసుకున్న యువతి
