ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ప్రతాప్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం హృదయ విదారకంగా మారింది.
జిల్లాలోని మహౌలీ ప్రాంతంలో వందేళ్లకు పైబడిన ఓ పాత ఇల్లు భారీ వర్షాల ప్రభావంతో తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో ఇంటి పెద్దతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, చిన్నారులు మరణించడం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, సమీప ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు అధికంగా కురుస్తుండటంతో పలు నగరాల్లో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా లఖ్‌నవూ, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, నోయిడా వంటి ప్రాంతాల్లో నీటిమునిగిన రహదారులు, ట్రాఫిక్ అంతరాయం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
భారత వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. పాత, బలహీనమైన భవనాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
also read: మార్కాపురంలో విషాదం.. పాము కాటుతో మహిళా రైతు మృతి
