Homeక్రైమ్పల్నాడులో షాకింగ్ ఘటన.. వృద్ధ దంపతులపై దాడి, మహిళ మృతి

పల్నాడులో షాకింగ్ ఘటన.. వృద్ధ దంపతులపై దాడి, మహిళ మృతి

క్రైమ్ మిర్రర్ : పల్నాడు జిల్లా పెదకూరపాడులో వృద్ధ దంపతులపై జరిగిన దారుణ దాడి తీవ్ర కలకలం రేపింది. ప్రశాంతంగా ఉండే ఈ మండల కేంద్రంలో పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆధార్ కార్డు ధృవీకరణ పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు వృద్ధ దంపతులపై అమానుషంగా దాడి చేయగా, వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

పెదకూరపాడులోని దామచర్లపాలెంలో నివసిస్తున్న అవ్వారి బాలగురవయ్య, అరుణ దంపతుల ఇంటికి ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో ఇద్దరు యువకులు చేరుకున్నారు. బాలగురవయ్యను ఆధార్ కార్డు చూపించాలని కోరగా, అరుణ ఇంట్లోకి వెళ్లి కార్డు తీసుకురావడానికి ప్రయత్నించారు. అదే సమయంలో నిందితులు బాలగురవయ్యపై సుత్తితో దాడి చేశారు.

భర్త కేకలు వినగానే అరుణ అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నిందితులు ఆమెపై కూడా దాడి చేసి గొంతు కోశారు. తీవ్రంగా గాయపడిన అరుణ బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలగా, అక్కడికక్కడే మృతి చెందింది. బాలగురవయ్య కేకలు విని స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే నిందితులు పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలగురవయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలగురవయ్య తన భార్య పరిస్థితి గురించి పదేపదే ఆరా తీయడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. అయితే ఆమె మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు ఆయనకు వెంటనే తెలియజేయలేదు.

సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ కృష్ణ చైతన్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల ఈ దంపతులు భూమి విక్రయించి నగదు పొందిన విషయం వెలుగులోకి రావడంతో, ఆర్థిక లావాదేవీలు లేదా పరిచయస్తుల ప్రమేయం ఉందా అనే దిశగా కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పెదకూరపాడు మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
also read : ఆ 60 లక్షల ఓట్ల గల్లంతు వెనుక!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు