-
తెలంగాణలో 60 లక్షలు ఔట్
-
అన్ని పార్టీల్లోనూ ఆందోళన
-
ఏపీతో పోల్చుకుంటే ఎక్కువగానే..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణలో 60 లక్షల ఓట్లు ఔట్ కానున్నాయా? ఆ ఓట్లన్నీంటిని తొలగించనున్నారా? అదే జరిగితే రాజకీయంగా ఏ పార్టీకి నష్టం? తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఏన్యుమరేషన్ ఫారాల సమర్పణ కోసం క్షేత్రస్థాయిలో ఓటర్లను కలుస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి అవకాశం కనిపిస్తోంది. ఈనెల 10 తర్వాత ప్రక్రియను పూర్తి చేసి ముసాయిదాను ప్రకటించనున్నారు. అయితే భారీగా ఓట్లు తగ్గనుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో ఆందోళన నెలకొంది.
-
10 వరకు సర్..
రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఓట్లు తగ్గుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఈ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో గడువు పెంచుతూ వచ్చారు. ఈనెల 10 వరకు పొడిగించారు. ఈ మొత్తం ప్రక్రియలు 60 లక్షల ఓటర్ల మేర తగ్గవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో అయితే 44 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గింది. అయితే తొలగించే ప్రతి ఓటరుకు నోటీసులు ఇస్తారు. వారి వివరణ తీసుకుంటారు. ఆ తరువాతే నిర్ణయం ఉంటుంది అనేది ఎన్నికల అధికారుల అభిప్రాయం. సర్ నమోదులో భాగంగా ఇల్లు మారిన ఓటర్ల వివరాలు సేకరణలో ఇబ్బందులు తప్పడం లేదు. చనిపోయిన వారితో పాటు డూప్లికేట్ ఓట్లు, ఇతర రాష్ట్రాల వారి ఓట్లు వంటివి దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే ఈ నెల 10 తో గడువు ముగుస్తుంది. మరో నాలుగు రోజుల సమయం ఉండడంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
-
అందరిలోనూ ఆందోళన..
అన్ని రాజకీయ పార్టీల్లో దీనిపై ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి దీనిపై ఆందోళనతో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం స్వాగతిస్తోంది. అయితే తమ పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్లు తొలగించకుండా ఉండేందుకు ఆ పార్టీ శ్రేణులు గట్టి ప్రయత్నాలు చేసాయి. ఇప్పటివరకు సహకరించిన వివరాలకు సంబంధించి 77.66% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఈ ప్రక్రియ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో మందకోడిగా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఓటర్లు ఉండడం.. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, చిరునామా నిర్ధారణలో ఇబ్బంది వంటివి జాప్యానికి కారణం. మొత్తానికి సర్ ప్రక్రియ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో 60 లక్షలకు పైగా ఓట్లు తగ్గే అవకాశం ఉంది. దాదాపు 40 లక్షల మంది ఓటర్ల జాబితాలోని చిరునామాలు అందుబాటులో లేని విషయాన్ని అధికారులు గుర్తించారు.
