Homeఆంధ్ర ప్రదేశ్ఏపీ క్యాబినెట్లో భారీ ఉద్వాసన!

ఏపీ క్యాబినెట్లో భారీ ఉద్వాసన!

  • ఐదుగురు అవుట్

  • పనితీరు బాగా లేకపోవడం కారణం

  • రాజకీయంగా ముద్ర చూపలేకపోతున్న వైనం

  • తీవ్ర అసహనంలో చంద్రబాబు

  • స్థానిక సంస్థల తర్వాత విస్తరణ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో ఐదుగురు మంత్రులపై ఉద్వాసన తప్పదా? చంద్రబాబు సీరియస్ గా ఉన్నారా? వారి పనితీరు మెరుగుపడడం లేదా? అందుకే మార్చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైనే ప్రచారం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా ఐదుగురు మంత్రులపై కత్తి వేలాడుతోంది. దీనిపై రకరకాల ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు.. కోస్తాంధ్ర నుంచి ఇద్దరు.. రాయలసీమ నుంచి ఒకరు క్యాబినెట్ నుంచి అవుట్ కాక తప్పదని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

  • స్థానిక ఎన్నికలు పూర్తి..

కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ లోగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. ముందుగా మున్సిపాలిటీలకు, తరువాత పంచాయతీలకు, చివరిగా ప్రాదేశికాలకు ఎన్నికలు జరపాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ ప్రక్రియ డిసెంబర్ లో ముగుస్తుంది. అందుకే సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. ఓ అయిదుగురు మంత్రులు క్యాబినెట్ నుంచి అవుట్ అవుతారని.. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవితో కలుపుకొని ఆరుగురిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆశావహులు ఓ 10 మంది వరకు ఉన్నారు. అందులో సీనియర్ నేతలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న పదిమంది మంత్రులు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని వారిని ఎంపిక చేశారు చంద్రబాబు. కానీ ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా వారు పని చేయడం లేదు. శాఖ పరంగా మెరుగైన పనితీరు కనబరచడం లేదు. ఫైళ్లను క్లియరెన్స్ చేయడం లేదు. రాజకీయంగా దూకుడు ప్రదర్శించడం లేదు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే విమర్శలను తిప్పి కొట్టడం లేదు. ఈ పరిణామం తోనే చంద్రబాబు ఓ ఐదుగురు మంత్రులను క్యాబినెట్ నుండి తప్పించేందుకు సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • మహిళా మంత్రులు సైతం..

ప్రస్తుతం క్యాబినెట్లో మహిళా మంత్రులు సైతం ఉన్నారు. అందులో ఒకరిద్దరి మార్పు తప్పదు అని తెలుస్తోంది. ఇంకోవైపు ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి అవుట్ అవుతారని.. ఆయన స్థానాన్ని అదే జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేతో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఇద్దరు మంత్రులను తొలగించడం ఖాయం అన్నట్లు ప్రచారం సాగుతోంది. పనితీరుపరంగా కాకుండా రాజకీయంగాను ఇద్దరు పై పెద్దగా పాజిటివ్ లేదు. అందుకే ఆ ఇద్దరినీ పక్కన పెట్టి వారి స్థానంలో సీనియర్ నేతలకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. రాయలసీమలో ఒకరిని మంత్రి పదవి నుంచి తొలగించి.. మరో సీనియర్ నేతతో భర్తీ చేస్తారని ప్రచారం సాగుతోంది. లేనిపోని వివాదాల్లో కొంతమంది మంత్రులు తలదూర్చుతున్నారు. నియోజకవర్గాల్లో మద్యం, మట్టి మాఫియాలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కానీ కొన్ని జిల్లాల్లో మంత్రులు స్వయంగా ఈ తతంగాన్ని నడుపుతున్నారు. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా చంద్రబాబుకు తెలిసింది. అందుకే ఆయన గట్టి హెచ్చరికలు పంపారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రావడం లేదు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు