Homeతెలంగాణ'హైడ్రా' మోదమా? ఖేదమా?

‘హైడ్రా’ మోదమా? ఖేదమా?

-మెజారిటీ ప్రజల ఆశాకిరణం గా ఈ వ్యవస్థ
-ప్రజావాణి వేదికకు భారీగా బాధితులు, ఫిర్యాదుదారులు
-వ్యతిరేకిస్తున్న ఆక్రమణదారులు, ప్రతిపక్షాలు
-నిరుపేదల విషయంలో తప్పులు సరిదిద్దుకుంటే గొప్పవ్యవస్థగా మారే అవకాశం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- తెలంగాణ రాజకీయం ఇప్పుడు హైడ్రా చుట్టూనే నడుస్తోంది. ఆ వ్యవస్థ పై ప్రతిపక్షాలు, బాధితులు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం హైడ్రా పై అనుకూల వాతావరణం అధికంగా ఉంది. హైడ్రా వారం వారం నిర్వహిస్తున్న ప్రజావాణి వేదికకు ఫిర్యాదుదారులు వేల సంఖ్యలో క్యూ కడుతున్నారు. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నట్టు హైదరాబాద్ తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంటే.. ప్రజలు పదే పదే తమ సమస్యల పరిష్కారం కోసం ఈ వ్యవస్థని ఎందుకు ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మిలియన్ డాలర్ల ప్రశ్న కూడా ఇదే. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి వేల ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్లియర్ చేసేందుకు కొన్ని వారాల పాటు ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేయాల్సిన దుస్థితి వచ్చింది. అంటే హైడ్రా వ్యవస్థకు ఏ స్థాయిలో ఆదరణ ఉందో ఇట్టే చెప్పవచ్చు.

రేవంత్ ప్రతిష్టాత్మకంగా..
రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది హైడ్రావస్థను. అయితే ఇది ప్రారంభమైన నాటి నుంచి వివిధ మాధ్యమాల ద్వారా వచ్చిన దరఖాస్తులు 20 వేలకు పైమాటే. కేవలం ప్రజావాణి ద్వారానే వేలాది ఫిర్యాదులు నేరుగా అధికారుల ముందుకు వచ్చాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆస్తులపై కబ్జాదారుల దౌర్జన్యం, చెరువుల ఎఫ్.టి.ఎల్ పరిధి ఉల్లంఘనలు, నాలాల మూసివేత, రోడ్ల ఆక్రమణలు వల్ల తీవ్రంగా నష్టపోతున్న సాధారణ పౌరులకు హైడ్రా ఒక ఆశా కిరణంగా కనిపిస్తోంది. ఏళ్లుగా జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పరిష్కారం కానీ పబ్లిక్ లేఅవుట్లు, పార్కుల ఆక్రమణల వివాదాలు హైడ్రా జోక్యంతో గంటల వ్యవధిలో పరిష్కారం అవుతున్నాయి. అందుకే ఈ వ్యవస్థను ప్రజలు ఎక్కువగా నమ్ముతున్నారు.

నిరుపేదలే బాధితులు..
అయితే ఈ ప్రతిష్టాత్మకమైన వ్యవస్థకు ప్రజామోదం ఒకవైపు ఉంటే… బాధితుల భయాలు, చట్టపరమైన విమర్శలు మరోవైపు బలంగా ఉన్నాయి. నాలాతోపాటు చెరువుల వద్ద దశాబ్దాలుగా నివసిస్తున్న పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు హైడ్రా బుల్డోజర్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైడ్రా తీసుకుంటున్న ఏకపక్ష కూల్చివేతల నిర్ణయాలు, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తీసుకుంటున్న చర్యలపై న్యాయస్థానాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు కేసులు పెరుగుతుండడం, అదే స్థాయిలో ధిక్కరణ కేసులు నమోదవుతుండడంతో.. ఈ వ్యవస్థ పై ప్రతికూల కోణాన్ని చూపుతున్నాయి. బిల్డర్లతో పాటు ఆక్రమణదారులు నష్టపోతుంటే పరవాలేదు కానీ.. నిరుపేదలు ఎక్కువగా నష్టపోతుండడం ఈ వ్యవస్థ పై విమర్శలు పెరగడానికి కారణం.

విమర్శలు సర్వసాధారణం..
ఇటువంటి సాహసోపేతమైన చర్యలకు దిగుతున్న హైడ్రావ్యవస్థపై విమర్శలు రావడం అనేది సర్వసాధారణం కూడా. చెరువులు,, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుకునే నగరవాసులు.. వరద భయాలనుంచి హైదరాబాద్కు ముక్తి కలగాలని ఆశించే కాలనీ సంక్షేమ సంఘాలకు హైడ్రా ఒక బలమైన రక్షణ వ్యవస్థగా కనిపిస్తోంది. అందుకే పూర్తి మద్దతు దొరుకుతోంది. మరోవైపు కూల్చివేతలకు గురైన బాధితులు, ప్రతిపక్షాలు దీనిని ప్రభుత్వం చేపడుతున్న రాజకీయ అణచివేత చర్యగా, చట్టబద్ధతలేని ఒక వ్యవస్థగా అభివర్ణిస్తున్నాయి.

అందుకే విశ్వాసం..
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యవస్థ పై హైదరాబాద్ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. ప్రజావాణి వేదికగా వస్తున్న విన్నపాలు, ఫిర్యాదులు దీనిని తెలియజేస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండితనం, ఆక్రమణలపై చర్యలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ధోరణితో విసిగిపోయిన ప్రజలకు.. కచ్చితంగా వ్యవహరించే హైడ్రా పై విశ్వాసం పెరిగింది. విమర్శలను స్వీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియలు పాటిస్తూ.. పేదలకు నష్టం కలగకుండా నిజమైన ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తే మాత్రం హైడ్రా మరింత ప్రజాదరణ దక్కించుకోవడం ఖాయం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు