పాల నుంచి తయారయ్యే సంప్రదాయ పనీర్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో విస్తరిస్తున్న ‘అనలాగ్ పనీర్’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తి తయారీ, నిల్వ, విక్రయాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారికి ఆరు నెలల వరకు జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ అనలాగ్ పనీర్ వినియోగం వల్ల ఎవరికైనా ప్రాణాపాయం సంభవిస్తే, బాధ్యులపై జీవిత ఖైదు శిక్షతో పాటు కనీసం రూ.10 లక్షల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ నిర్ణయంతో అనలాగ్ పనీర్‌ను నిషేధించిన దేశంలో రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఇలాంటి నిషేధం అమల్లోకి వచ్చింది.
సాధారణంగా పనీర్‌ను పాలతో తయారు చేస్తారు. అయితే అనలాగ్ పనీర్ తయారీలో పాల కొవ్వుకు బదులుగా పామ్ ఆయిల్, ఇతర వెజిటెబుల్ ఆయిల్స్, స్టార్చ్, పాల పొడి వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఉత్పత్తి మార్కెట్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అసలైన పనీర్‌నే వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడంతో ఆహార భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
also read: దీపావళి బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’ సంగ్రామం
