విజయవాడ, క్రైమ్‌మిర్రర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటకరంగం అభివృద్ధి , అలాగే ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల విశిష్టతను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఆయన ప్రతిభను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నాయి. గతంలో గుజరాత్ పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా రంగంలోకి దింపారు. అదే తరహా వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్‌ను మరింత పెంచేందుకు చిరంజీవి క్రేజ్, గ్లోబల్ పాపులారిటీ ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read:ఎపిక్ రిలీజ్ డేట్ అనౌన్స్.. సెప్టెంబర్‌లో థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ…!
జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు సాధించడంతో పాటు గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం చిరంజీవికి ఉంది. సినిమా రంగానికే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయనకున్న విశ్వసనీయత రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఇమేజ్ ద్వారా పర్యాటకులు, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడం మరింత సులువవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.చిరంజీవి వ్యాపార రంగానికి కాకుండా నేరుగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, టూరిజం ప్రమోషన్ కోసం భాగస్వామి కావడం వల్ల ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయ రంగాన సరికొత్త ఉత్సాహం నెలకొంది.
Also Read:త్రిష చుట్టూ తమిళ రాజకీయం!
గత కొన్ని నెలలుగా కూటమి ప్రభుత్వానికి అనుకూల సంకేతాలు ఇస్తూ వస్తున్న చిరంజీవి, ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ అంశంపై తుది రూపుదిద్దుకుంటున్న ప్రక్రియ త్వరలోనే కొలిక్కి రానుందని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేదా సంతకాల ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇది ఖరారైతే, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో మెగాస్టార్ పాత్ర అత్యంత కీలకమైనదిగా మారనుంది.
