Homeఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీకి జగన్?!

అసెంబ్లీకి జగన్?!

-వర్షాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు నిర్ణయం
-సీనియర్ల నుంచి అభిప్రాయాలు సేకరణ
-వెళితే మంచిదంటూ ఎక్కువ మంది అభిప్రాయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో
:-
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారా? ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారా? మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లేందుకు మగ్గుచూపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూటమి వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ తరుణంలో జగన్ సైతం తన వ్యూహాన్ని మార్చుతున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

17 నుంచి సమావేశాలు..
ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు హాజరయ్యేది లేదు అంటూ ఆయన గైర్హాజరవుతూ వచ్చారు. అయితే నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని అసెంబ్లీ స్పీకర్ తేల్చి చెప్పారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సభకు హాజర విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతూ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వరుసగా సమావేశాలకు హాజరు కాకుంటే అనర్హత వేటుపడుతుందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే గవర్నర్ ప్రసంగాల సమయంలో సభకు హాజరై తర్వాత గైర్హాజరవుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. కానీ తాజాగా ప్రారంభం ఉన్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కీలక బిల్లులు..
ఈసారి సభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా బీసీ రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీల విషయంలో తమ ప్రభుత్వం చేసిన న్యాయం మరో ప్రభుత్వం చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. పైగా ఇటీవల రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటినీ సభకు వెళ్లి నిలదీయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు, సాయి కృష్ణ లాకప్ డెత్, రైతు సమస్యలు, ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పై సభలో చర్చించేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు సమాచారం. సభలో ఎక్కువ సమయం మాట్లాడేందుకు కోరి.. ప్రభుత్వం నుంచి ఎదురుదాడి మొదలైన మరుక్షణం నిరసన తెలుపుతూ బయటకు రావాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

సీనియర్ల అభిప్రాయం కూడా అదే..
అసెంబ్లీ సమావేశాలకు హాజరు విషయంలో సీనియర్ నేతల అభిప్రాయాన్ని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశాన్ని నిర్వహించారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం సభకు వెళితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సభకు వెళితే కానీ ప్రజామోదం దక్కదు అన్న వారు కూడా ఉన్నారు. సభకు వెళ్లి మాట్లాడేందుకు అవకాశం కోరాలని.. కూటమి ఎమ్మెల్యేల నుంచి ఎదురుదాడి వస్తుందని.. అప్పుడు తట్టుకొని నిలబడితే ప్రజల్లో సానుభూతి లభిస్తుంది అన్నది సీనియర్ల మాట. శాసనసభకు వెళ్లడం లేదన్న విమర్శలకు చెక్ పెట్టినట్టు అవుతుందని ఎక్కువ మంది అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో సభకు వెళ్లేందుకు జగన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు