క్రైమ్ మిర్రర్ : వరదల్లో ఎంతోమందిని కాపాడిన ఓ రక్షకుడు, మరో వ్యక్తి ప్రాణాలను కాపాడే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయాడు. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తిరువనంతపురానికి చెందిన ఆర్. రాజేష్ (36) స్విమ్మింగ్, రాపెల్లింగ్ శిక్షకుడిగా పనిచేస్తున్నారు. గతంలో 2018 కేరళ వరదలు, 2024లో వయనాడ్లో జరిగిన ప్రకృతి విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొని పలువురి ప్రాణాలను రక్షించారు. ఇటీవల కన్నూర్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రాజేష్ తన బృందంతో కలిసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 2న మీన్తుల్లి ద్వీపం సమీపంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో 61 ఏళ్ల రైతు బెన్నీ వరదల్లో చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న రాజేష్ తన సహచరులు షిబిన్, జితిన్లతో కలిసి రైతును కాపాడేందుకు అక్కడికి చేరుకున్నారు. కరియంగోడ్ నదిని ఈదుకుంటూ దాటి బెన్నీ వద్దకు చేరుకున్నారు. తిరిగి తీసుకువస్తున్న సమయంలో రైతు మునిగిపోయే పరిస్థితి కనిపించడంతో రాజేష్ తన వద్ద ఉన్న లైఫ్ జాకెట్ను తీసి అతడికి అందించారు. అయితే తిరుగు ప్రయాణంలో రక్షణ బృందం తాడును పట్టుకుని వస్తుండగా, ఒడ్డుకు సమీపంలో రాజేష్ అదుపు తప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. మూడు రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యల అనంతరం మంగళవారం ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడిన రాజేష్.. ఓ వృద్ధ రైతు కోసం తన ప్రాణాలను త్యాగం చేయడంపై కేరళ ముఖ్యమంత్రి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
also read : రామన్నపేట ఆసుపత్రిలో గర్భిణీలకు దక్కని గౌరవం…!
