Homeతెలంగాణవరంగల్‌లో గురుకుల హాస్టల్ లో 25 మంది బాలికలు అస్వస్థత

వరంగల్‌లో గురుకుల హాస్టల్ లో 25 మంది బాలికలు అస్వస్థత

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో గిరిజన బాలికల సంక్షేమ గురుకుల హాస్టల్‌లో ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. ఫిరంగిగడ్డలో ఉన్న వసతి గృహానికి చెందిన సుమారు 25 మంది విద్యార్థినులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.

సమాచారం ప్రకారం, ఆదివారం రాత్రి హాస్టల్‌లో చికెన్‌తో భోజనం చేసిన విద్యార్థినులు, సోమవారం ఉదయం టిఫిన్ అనంతరం వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వార్డెన్‌కు తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థినులను సమీప ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో వైద్యులు బాలికలకు చికిత్స అందిస్తూ, ఆహారం కలుషితం కావడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని తమ పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అనంతరం, హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం, సరైన వసతులు కల్పించడంలో లోపాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంఘటనపై స్పందించిన అధికారులు కూడా ఆస్పత్రిని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అనంతరం హాస్టల్‌కు వెళ్లి వంటశాల, నివాస గదులు, పరిసరాలను తనిఖీ చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

also read: కాంగ్రెస్ నేతలకు హరీశ్‌రావు లీగల్ నోటీసులు

తాజావార్తలు