క్రైమ్ మిర్రర్, సినిమా:- క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హిట్ ఫ్రాంచైజీపై మరోసారి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మూడు భాగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌లో నాలుగో చిత్రానికి తమిళ స్టార్ కార్తీ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హిట్ 5లో అక్కినేని నాగచైతన్య హీరోగా కనిపించే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. దర్శకుడు శైలేష్ కొలను ఇప్పటికే నాగచైతన్యకు కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ కూడా పొందినట్లు ప్రచారం జరుగుతోంది.హిట్ ఫ్రాంచైజీ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భాగం ముగింపులో తర్వాతి కేసును హ్యాండిల్ చేసే అధికారిని పరిచయం చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండో భాగంలో అడివి శేష్, మూడో భాగంలో నాని ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం హిట్ 4లో కార్తీ కీలక పాత్ర పోషించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఇక హిట్ 5 కోసం నాగచైతన్య పేరును పరిశీలిస్తున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
కడుపు ఉబ్బరం, గ్యాస్ వేధిస్తున్నాయా.. పరగడుపున ఈ నీళ్లు తాగండి!
ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న వృషకర్మ చిత్రంలో నటిస్తున్నారు. తండేల్ విజయంతో మంచి ఊపులో ఉన్న ఆయన, ఈ సినిమా పూర్తైన తర్వాత శైలేష్ కొలను దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.మరోవైపు శైలేష్ కొలను ప్రస్తుతం రోషన్ మేకతో ఏమో ఏమో ఇది అనే రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈసారి పూర్తి భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే హిట్ 4 పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.అటు కార్తీ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన సర్దార్ 2 విడుదలకు సిద్ధమవుతుండగా, మార్షల్, కార్తీ 30 వంటి చిత్రాలు కూడా లైన్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల తర్వాత హిట్ 4 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. దీంతో హిట్ 4, హిట్ 5 చిత్రాలపై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం నాగచైతన్య పేరు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
కోర్టు షాక్‌తో బీజేపీ నేత ప్రాణేష్ రాజీనామా.. ఎమ్మెల్సీగా గాయత్రి శాంతేగౌడకు అవకాశం
