క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్లో పసికందును విక్రయించేందుకు జరిగిన ప్రయత్నం కలకలం రేపింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును డబ్బులకు విక్రయించేందుకు ఓ మహిళ ప్రయత్నించగా, సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో స్పందించి చిన్నారిని రక్షించారు. ఈ ఘటనపై బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. చంద్రాయణగుట్టకు చెందిన వహీదా ఖతూన్ మంగళవారం ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ప్రసవించిన కొద్ది రోజులకే శిశువును విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
బార్కస్ ప్రాంతంలోని పీలీ దర్గా వద్ద మెహరున్నీసా అనే మహిళను కలిసి పసికందు విక్రయంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. తొలుత శిశువుకు రూ.6 లక్షలు డిమాండ్ చేసినప్పటికీ, అనంతరం బేరసారాలు జరిపి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న సామాజిక కార్యకర్త సఫియా మాహి వెంటనే బాలాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంబంధిత అధికారులతో కలిసి రంగంలోకి దిగారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును సురక్షితంగా స్వాధీనం చేసుకుని సంరక్షణలోకి తీసుకున్నారు. శిశువు తల్లిగా చెప్పుకుంటున్న వహీదా ఖతూన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసికందు విక్రయం వెనుక మరెవరైనా ఉన్నారా? ఏదైనా ముఠా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read : నిద్రలో ఉన్న విద్యార్థినులపై బ్లేడ్ దాడి.. అనంతపురంలో షాకింగ్ ఘటన
