క్రైమ్ మిర్రర్ : నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ న్యాయవాది హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. క్లినిక్‌లో చికిత్స కోసం వచ్చినట్లుగా నమ్మించి, పథకం ప్రకారం దాడి చేసిన దుండగులు ఆయనను బయటకు ఈడ్చుకెళ్లి వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పెంట్లవెల్లి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. పెంట్లవెల్లి గ్రామానికి చెందిన మల్లయ్య (55) ఆర్‌ఎంపీ వైద్యుడిగా సేవలందించడంతో పాటు న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన క్లినిక్‌లో ఉండగా ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చికిత్స అవసరమని చెప్పి లోపలికి వెళ్లారు. వారిని పరీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా మల్లయ్య కళ్లలో కారం చల్లి దాడికి దిగినట్లు సమాచారం.
దాడి అనంతరం ఆయనను క్లినిక్ బయటకు ప్రధాన రహదారిపైకి లాక్కెళ్లిన నిందితులు వేటకొడవళ్లతో పలుమార్లు దాడి చేశారు. తీవ్ర గాయాల కారణంగా మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక భూ వివాదాలు లేదా ఇతర వ్యక్తిగత విభేదాలు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.
also read : కేరళలో కుండపోత వర్షాల బీభత్సం.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి, పలువురి కోసం గాలింపు
