2020లో దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఈ తీర్పు వెలువడింది.
ఈ కేసులో తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కూడా కోర్టు దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో అంకిత్ శర్మ మృతి చెందారు. ఈ ఘటనపై నమోదైన కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు శిక్ష ఖరారు చేసింది.
ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటూ దోషులకు మరణశిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. అయితే అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదును విధించింది.
తీర్పు సందర్భంగా నేర తీవ్రత, కేసుకు సంబంధించిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ఢిల్లీ అల్లర్ల కేసుల్లో మరో కీలక పరిణామంగా మారింది.
also read: కంకర రాళ్లకు బంగారు పూత.. గుప్తనిధుల పేరుతో రూ.లక్షల్లో మోసం.. నిజామాబాద్‌లో ఘటన
