క్రైమ్ మిర్రర్ : కుటుంబ ఆస్తి వివాదం ఓ మహిళపై హత్యాయత్నానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను టప్పాచబుత్ర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం కుల్సుంపుర డివిజన్ ఏసీపీ వి. తిరుపతి, ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. దైబాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ దస్తగిరి షరీఫ్ అలియాస్ పప్పుకు తన వదిన షమీమ్ బేగంతో కుటుంబ ఆస్తికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న దస్తగిరి, తన స్నేహితులు ఎండీ గులామ్ నబీ ఖురేషి, మహమ్మద్ ఉస్మాన్‌లతో కలిసి పథకం రచించాడు.
ఈ నెల 27వ తేదీన ముగ్గురు నిందితులు స్కూటర్‌పై షమీమ్ బేగం నివాసానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం కసాయి కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె భర్త మహమ్మద్ అజం షరీఫ్‌పై కూడా కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన షమీమ్ బేగం ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలోని మరో ఇంటిలోకి పరుగెత్తగా, నిందితులు వెంటాడి ఆమె కడుపులో మరోసారి కత్తితో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా గమనించిన స్థానికులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టప్పాచబుత్ర పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కసాయి కత్తితో పాటు హోండా ఆక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన టప్పాచబుత్ర ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రాజు మరియు పోలీసు సిబ్బందిని కుల్సుంపుర డివిజన్ ఏసీపీ అభినందించారు.
also read : డ్రగ్స్ కేసులో ఉపాధ్యాయుల పేర్లు.. కేరళలో కలకలం రేపుతున్న మత్తు రాకెట్
