క్రైమ్ మిర్రర్ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న వేళ పోలవరం ప్రాజెక్టు వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. దిగువ కాఫర్ డ్యామ్ సమీపంలో నదిలో మునిగిపోయిన జేసీబీని బయటకు తీసే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా, ఆయన పోలవరం ప్రాజెక్టుకు చెందిన ఇంజినీర్‌గా గుర్తించారు. వివరాల ప్రకారం.. ప్రాజెక్టు పరిధిలో నదిలో మునిగిన జేసీబీని వెలికితీసేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జేసీబీకి తాడు కట్టే సమయంలో ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు గోదావరి ప్రవాహంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. మత్స్యకారుల సహాయంతో నదిలో అన్వేషణ చేపట్టగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌గా గుర్తించారు. మరో వ్యక్తి మిషన్ ఆపరేటర్‌గా గుర్తించగా, అతడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఉత్తరాంధ్ర తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.
also read :అల్లు అర్జున్‌ను హీరోగా తీసేసిన స్టార్ డైరెక్టర్.. షాకింగ్ నిజం బయటపెట్టిన టాప్ డైరెక్టర్…!
