క్రైం మిర్రర్ : మీర్పేట్లో జరిగిన రౌడీ షీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే కేసులో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, వారిని రిమాండ్‌కు తరలించారు. మీర్పేట్ ఇన్స్పెక్టర్ శోభన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి (41)ను నందనవనం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు మహమ్మద్ అర్ఫాస్కు మృతుడు సూరితో గతంలో నుంచి కుటుంబ పరమైన విభేదాలు ఉన్నాయి. తన కుటుంబ సభ్యుల విషయంలో ఏర్పడిన కక్షతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మహమ్మద్ అర్ఫాస్ (22), సుహిద్రమణి స్వామి (19), జంగిలొల్ల నాని (19)లను నిందితులుగా గుర్తించారు. వీరిలో అర్ఫాస్ పంక్చర్ షాపులో పనిచేస్తుండగా, సుహిద్రమణి స్వామి ప్రైవేట్ ఉద్యోగిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి 11.44 గంటల సమయంలో నందనవనం ప్రాంతంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న సూరిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, విచారణ ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరానికి సంబంధించిన వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
also read : అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. సీసీటీవీలో రికార్డైన కాల్పుల దృశ్యాలు