తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచే అరుదైన పల్లవోత్సవం ఈ నెల 22న వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవం ప్రత్యేకత ఏమిటంటే, శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు ఊరేగింపుగా తిరుమలలోని కర్ణాటక సత్రానికి వేంచేపు చేయడం.
సహస్రదీపాలంకార సేవ అనంతరం ప్రారంభమయ్యే ఈ ఘట్టం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. మైసూరు మహారాజు జన్మ నక్షత్రం అయిన ఉత్తరాభాద్రను పురస్కరించుకుని ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం. కర్ణాటక రాష్ట్రం, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామివారిని సంప్రదాయబద్ధంగా ఆహ్వానించి ప్రత్యేక హారతులు సమర్పిస్తారు.
ఈ పల్లవోత్సవానికి దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. మొదట్లో దీనిని తోటోత్సవం అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది పల్లవోత్సవంగా రూపాంతరం చెందింది. కర్ణాటక సత్రానికి చేరుకున్న అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
మైసూరు మహారాజు తిరుమల శ్రీవారికి అతి పెద్ద భక్తుడిగా పేరుగాంచారు. ఆలయానికి అనేక విరాళాలు అందించడమే కాకుండా, బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ వంటి వాహనాలను సమర్పించారు. అంతేకాకుండా, ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో తయారు చేసిన పల్లకీ కూడా ఆయన సమర్పణలో భాగమే.
అలాగే శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాత సేవకు ముందు నవనీత హారతి, బ్రహ్మదీపం, మహారాజ దీపం కోసం ప్రతిరోజూ నెయ్యి సమర్పించే ఆచారం కూడా మైసూరు మహారాజు ప్రారంభించినదే. ఈ సంప్రదాయం ఇప్పటికీ నిరంతరం కొనసాగుతోంది.
ప్రతి నెల ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున మైసూరు మహారాజు జ్ఞాపకార్థం ప్రత్యేక ఆస్థానం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఉగాది, దీపావళి, ఆణివార ఆస్థానాలలో ఆయన పేరుతో ప్రత్యేక హారతి సమర్పించడం ఆనవాయితీగా ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జరిగే ఉట్లోత్సవంలో కూడా మలయప్ప స్వామివారు కర్ణాటక సత్రాలకు వేంచేపు చేయడం విశేషం. ఈ అరుదైన పల్లవోత్సవం తిరుమలలోని వైభవాన్ని, చరిత్రను, భక్తి పరంపరను మరోసారి సజీవంగా చూపించబోతోంది.
also read: తిరుమల నడకదారిలో వైరల్ ఘటన: అడవి పందిని వరాహ అవతారంగా భావించి పూజలు.. స్పందించిన అధికారులు