తెలంగాణలోని ములుగు జిల్లాలో ఆశ్రమం పేరుతో అక్రమ గంజాయి సాగు చేస్తున్న ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపింది. తాండూరు మండల పరిధిలో ఉన్న ఓ ఆశ్రమంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి, సాధువుగా నటిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, గోవిందరావుపేట సమీపంలోని ఆ ఆశ్రమంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో ఆశ్రమ ప్రాంగణంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. మొత్తం 36 మొక్కలను వేర్లు సహా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ నిల్వ ఉంచిన ఎండిన గంజాయి కూడా పట్టుబడింది.
పట్టుబడిన వ్యక్తి కాశీ ప్రాంతానికి చెందిన శ్రీరామ్ గిరిగా గుర్తించారు. అతను తన సోదరితో కలిసి ఆశ్రమంలో ఉంటూ, ఆధ్యాత్మిక సేవల పేరుతో స్థానికులను నమ్మిస్తూ, రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. సీజ్ చేసిన గంజాయి నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించిన పోలీసులు, నిందితుడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నారు. పవిత్ర స్థలంగా భావించే ఆశ్రమంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
also read: ఇంన్ స్టాగ్రామ్ లో ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు