క్రైం మిర్రర్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న ఓ యువ విద్యార్థి హాస్టల్ భవనం పై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కోర్వి మండలం రాజోలు గ్రామానికి చెందిన 19 ఏళ్ల వాసుదేవ్ ఇబ్రహీంపట్నంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువుల నిమిత్తం ఎంబీఆర్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో హాస్టల్ భవనం పైకి వెళ్లిన అతడు అక్కడి నుంచి కిందకు దూకినట్లు సమాచారం.
సహ విద్యార్థులు, స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన వాసుదేవ్‌ను సమీపంలోని లిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన వెనుక వ్యక్తిగత కారణాలు ఉండి ఉండొచ్చని కొందరు స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ, పోలీసులు మాత్రం ఎలాంటి కారణాన్నీ ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని, పోస్టుమార్టం నివేదికతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొనగా, కళాశాల విద్యార్థులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఘటనకు గల కారణాలపై ఊహాగానాలు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు.
also read : పురుగుల మందు తాగి యువకుడు మృతి..! గ్రామంలో విషాదం…