క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల నడుమ బుధవారం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత్యక్రియలో పాల్గొన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తో కలిసి ముద్రగడ పద్మనాభం పాడే మోసారు జగన్. అంతకుముందు హెలిక్యాప్టర్ లో జగ్గంపేట చేరుకున్న జగన్.. రోడ్డు మార్గంలో కిర్లంపూడి లోని పద్మనాభం ఇంటికి చేరుకున్నారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముద్రగడ పద్మనాభం పాడే మోసి ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. ముద్రగడ నివాసానికి 100 మీటర్ల దూరంలోనే అంత్యక్రియలు జరిపారు.
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో..
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నారు ముద్రగడ. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పద్మనాభం జూన్ నెలలో హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుంచి సింధు ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించి కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం మరణ వార్త విన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తనయుడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ముద్రగడ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వైసిపి నేతగానే..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ముద్రగడ. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అలా చేయకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతోపాటు కూటమి అధికారంలోకి రావడంతో తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకున్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా ముద్రగడ చాలా యాక్టివ్గా ప్రకటనలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదాకా విశ్రమించనని ప్రకటనలు చేశారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగానే ముద్రగడ పద్మనాభం మరణించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నివాళులు అర్పించారు. కిర్లంపూడి వచ్చి అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్నారు. పాడేమోసి తన రుణం తీర్చుకున్నారు.