Homeరాజకీయంవేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే నిరాహార దీక్ష, పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం

వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే నిరాహార దీక్ష, పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం

నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష రాజకీయంగా వేడిని పెంచింది. దీక్షకు ముందు నుంచే పోలీసులు అప్రమత్తమై ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

వేల్పూర్‌లోని వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే తాను ప్రకటించిన కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదని స్పష్టం చేసిన ప్రశాంత్ రెడ్డి, తన నివాసంలోనే ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకరోజు శాంతియుతంగా నిరసన చేపడతానని ప్రకటించినందుకే ప్రభుత్వం ఇంతలా స్పందించడం ఎందుకని ప్రశ్నించారు. తాను ఉదయం లేవకముందే పెద్ద సంఖ్యలో పోలీసులు ఇంటి వద్దకు వచ్చి తనను గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు.

భాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తనకు మద్దతుగా వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని, పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారని ఆయన అన్నారు. భీంగల్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించడం, ప్రచార సామగ్రిని తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే భీంగల్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల లేదా రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే తన ఆందోళనను విరమించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

పోలీసు చర్యలతో తనను భయపెట్టలేరని పేర్కొన్న ఆయన, ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యలపై ప్రశ్నించడం తన బాధ్యత అని అన్నారు. ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భీంగల్ పట్టణం, మండల ప్రజలు, యువత, వివిధ సంఘాలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.

also read: కాకినాడ గొల్లప్రోలులో మాజీ కౌన్సిలర్ భర్త హత్య.. కత్తితో దాడి, ఆస్పత్రిలో మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు