Homeక్రైమ్తల్లి హత్య కేసులో కొత్త కోణం.. ఇప్పుడు తండ్రి మృతిపైనా అనుమానాలు

తల్లి హత్య కేసులో కొత్త కోణం.. ఇప్పుడు తండ్రి మృతిపైనా అనుమానాలు

క్రైం మిర్రర్ : రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సంచలనం సృష్టించిన లా విద్యార్థిని ఆయుషి కేసు మరో కీలక మలుపు తిరిగింది. తల్లి నీరజ్ శర్మ హత్య కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న ఆయుషిపై ఇప్పుడు తన తండ్రి విజయ్ శర్మ మృతికి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మృతురాలి సోదరుడు, ఆయుషి మేనమామ రాకేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కొత్త కోణంలో విచారణ ప్రారంభించారు.

ఆస్తి, ఉద్యోగం కోసమే కుట్ర..?

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. రాజస్థాన్ హైకోర్టులో కోర్టు మాస్టర్‌గా పనిచేసిన విజయ్ శర్మ మృతి చెందిన తర్వాత ఆయన భార్య నీరజ్ శర్మకు కారుణ్య నియామకం కింద క్లర్క్ ఉద్యోగం లభించింది. కుటుంబ ఆస్తులతో పాటు ఆ ఉద్యోగాన్ని కూడా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయుషి ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.ఈ నేపథ్యంలో తన బంధువుల సహకారంతో రూ.7 లక్షలకు సుపారీ ఇచ్చి జూలై 3న నీరజ్ శర్మను స్కార్పియో వాహనంతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం కూడా జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

తండ్రి మరణంపైనా ఫిర్యాదు

ఆయుషి అరెస్టు అనంతరం ఆమె మేనమామ రాకేశ్ శర్మ మరో సంచలన ఆరోపణ చేశారు. 2024లో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన విజయ్ శర్మకు ఉద్దేశపూర్వకంగా సరైన వైద్యం అందకుండా చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెరుగైన చికిత్స పేరుతో కుటుంబ సభ్యులకు తెలియకుండా వేరే చోట ఉంచారని, అనంతరం చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా ఆయన ఆరోగ్యం మరింత విషమించి 2025 ఏప్రిల్‌లో మరణించారని ఆరోపించారు.విజయ్ శర్మ మరణం తర్వాత కారుణ్య నియామక ఉద్యోగాన్ని పొందేందుకు ఆయుషి ప్రయత్నించిందని, అయితే ఆ ఉద్యోగం ఆమె తల్లి నీరజ్ శర్మకు రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు రాకేశ్ శర్మ పోలీసులకు వివరించారు.

కొత్త కోణంలో దర్యాప్తు

ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం చదువుతున్న ఆయుషికి చట్టాలపై అవగాహన ఉండటంతో నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేలా ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి, ఉద్యోగం, కుటుంబ విభేదాలే ఈ ఘటనల వెనుక ప్రధాన కారణాలై ఉండొచ్చని భావిస్తున్నారు.ప్రస్తుతం ఆయుషితో పాటు ఈ కేసులో అరెస్టైన నిందితులను పోలీసులు విచారిస్తుండగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. అదే సమయంలో విజయ్ శర్మ మృతికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
also read :కేరళలో విషాదం: చికిత్సకు వెళ్లిన 18 నెలల చిన్నారి మృతి – అనస్థీషియాపై తల్లిదండ్రుల ఆరోపణలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు