బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి, కుటుంబం వంటి నిర్ణయాలను భవిష్యత్తులో ప్రశాంతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
ఇటీవల ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పోడ్కాస్ట్ లో మాట్లాడిన కృతి, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరించింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘మిమి’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపింది. ఆ సినిమాలోని పాత్ర కోసం బరువు పెరగాల్సి రావడంతో, అదే సమయాన్ని ఎగ్ ఫ్రీజింగ్ కు కూడా ఉపయోగించుకున్నానని చెప్పింది. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలో భాగంగా శరీరంలో హార్మోన్ల మార్పులు రావడం, బరువు పెరగడం సహజమని కృతి తెలిపింది. సినిమా కోసం కూడా వెయిట్ గేన్ అవసరం ఉండటంతో, రెండు పనులు ఒకేసారి పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నానని వివరించింది.
అయితే ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదని కూడా ఆమె స్పష్టం చేసింది. చికిత్స సమయంలో మూడ్ స్వింగ్స్, శారీరక అసౌకర్యం, భావోద్వేగ మార్పులు ఎదుర్కొన్నానని చెప్పింది. కొన్నిసార్లు మానసికంగా కూడా కాస్త కష్టంగా అనిపించిందని, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే సరైన నిర్ణయం తీసుకున్నాననే సంతృప్తి ఉందని వెల్లడించింది. ప్రస్తుతం తనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోందని కూడా చెప్పింది.
కృతి సనన్ ఈ నిర్ణయం తీసుకున్న తొలి భారతీయ సెలబ్రిటీ మాత్రం కాదు. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిర్మాత ఏక్తా కపూర్, నటి మోనా సింగ్, రిచా చద్దా లాంటి ప్రముఖులు కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్న విషయాన్ని గతంలో వెల్లడించారు. ఇప్పుడు కృతి కూడా బహిరంగంగా ఈ విషయాన్ని పంచుకోవడంతో, మహిళల్లో ఈ అంశంపై మరింత అవగాహన పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.