-
15వ ఆర్థిక సంఘం నిధుల్లో భారీ అక్రమాలు…
-
అధికారుల అంతర్గత మౌనమే ఇందుకు కారణం
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ప్రజాధనం, ప్రత్యేక అధికారుల పాలనలో దోచుకుపోతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.!? నిబంధనలను తుంగలో తొక్కి, రాజకీయ పలుకుబడితో బిల్లులు లేపేశారన్న ప్రచారం నేడు జోరుగా సాగుతుంది.!
ఏండ్ల తరబడి ఒకే మండలంలో సేవలు, ఎక్కువ కాలం ఒకే గ్రామంలో డ్యూటీనే ఈ తప్పిదాలకు కారణమా అంటున్నారు మండల ప్రజలు..!? కారణం ఏదైనా 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు మండల వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
జరగని పనులకు బిల్లులు డ్రా చేయడం, ఫేక్ ఓచర్లు సృష్టించడం, పక్క మండలాల పనులను తమ పరిధిలో చూపడం వంటి, అక్రమాలకు పాల్పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.!
-
నిబంధనలు గాలికి.. పైకం జేబుల్లోకి
గ్రామ పంచాయతీల్లో జరిగే ఏ పనికైనా మొదట గ్రామసభ ఆమోదం తప్పనిసరి. అనంతరం పంచాయతీ తీర్మానం, అడ్మినిస్ట్రేటివ్ అనుమతి, టెక్నికల్ అనుమతి, అంచనా, వర్క్ ఆర్డర్ జారీ చేయాలి. పని ప్రారంభం నుండి పూర్తయ్యే వరకు కొలతల పుస్తకంలో కొలతలను నమోదు చేయడం, ఫోటోలతో సహా దృవీకరణ పత్రాలు జత చేయడం, కాంట్రాక్టర్ పేరు, బ్యాంక్ వివరాలు, లెడ్జర్, నోట్ ఫైల్ వంటి అన్ని రికార్డులను సక్రమంగా, నిర్వహించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులది.
మండల స్థాయిలో వీటన్నింటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీఓలది. కానీ మర్రిగూడలో ఈ ప్రొసీజర్ ఏ ఒక్కటీ సరిగ్గా అమలు కాలేదని తెలుస్తుంది.! కాగితాలపై మాత్రమే పనులు పూర్తయినట్లు చూపించి, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని జరగకుండానే లక్షల రూపాయల బిల్లులు డ్రా చేశారని అనేక ఆరోపణలు వినపడుతున్నాయి.!
నిజంగా కొన్ని పనులు జరిగినా, అసలు ఖర్చు కంటే నాలుగు రెట్లు అధికంగా బిల్లులు పెట్టి, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఫేక్ బిల్లులు, ఫేక్ ఓచర్లు తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
-
తెల్ల కాగితాలు అప్లోడ్…సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లో డబ్బులు
15వ ఆర్థిక సంఘం నిధులలో 2024 ఏప్రిల్ 1 నుండి 2025 డిసెంబర్ 31 వరకు అవినీతి మయమైనట్లు ప్రచారం..! ఈ సమయంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన, పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే అనేక అక్రమాలు బయటపడుతాయని మండల ప్రజల వాదన.! కొన్ని చోట్ల తెల్ల కాగితాలను స్కాన్ చేసి అప్లోడ్ చేశారని, మరికొన్ని చోట్ల పక్క మండలాల పరిధిలో జరిగిన, పనులను మర్రిగూడ మండల పరిధిలో జరిగినట్లు చూపించి బిల్లులు తీశారని తెలుస్తుంది.!
ఆయా పనులకు సంబంధమే లేని, సొంత కుటుంబ సభ్యుల పేరిట, బంధువుల పేరిట ప్రజాధనం బదిలీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ నిధులను కొల్లగొట్టేందుకు, స్థానిక అధికారి సపోర్ట్ నిండుగా ఉన్నట్లు అనేక అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి.!? క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా, నాణ్యతను నిర్ధారించకుండా కేవలం ఫైళ్ల ఆధారంగా, బిల్లులు పాస్ చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కొందరు మండిపడుతున్నారు.?
మర్రిగూడ మండలంలో ఏండ్ల కొద్ది ఒకే చోట పని చేస్తున్న, కొందరు గ్రామస్థాయి అధికారులు, తమ రాజకీయ పలుకుబడిని బహిరంగంగానే ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరి అండదండల వల్లే గ్రామ స్థాయి సిబ్బంది, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎంబిలు రికార్డు చేయడంలో పంచాయతీ రాజ్ అధికారులతో పాటు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా కుమ్మక్కై తప్పుడు లెక్కలు కట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.!?
పారదర్శకత, జవాబుదారీతనం పూర్తిగా లోపించడంతో, 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల అభివృద్ధికి బదులు, కొందరి జేబులకు చేరుకున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు గ్రామీణాభివృద్ధికి ఎంత కీలకమో, దీనిపై ప్రజల్లో పూర్తి నమ్మకం కలిగించేందుకు అధికార యంత్రాంగం విఫలమైందని వారు అంటున్నారు.
-
జిల్లా స్థాయి విచారణకు ప్రజల డిమాండ్.. స్పష్టత ఇవ్వకపోవడానికి గల కారణాలపై విమర్శలు..
ఈ మొత్తం వ్యవహారంపై మండల అధికారులతో విచారణ జరిపితే, నిజాలు బయటకు రావని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, జడ్పీసీఈఓ , డీపీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, మర్రిగూడ మండలం 15వ ఆర్థిక సంఘం బడ్జెట్ పై, సమగ్ర విచారణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
విచారణలో నిబంధనల ఉల్లంఘనలు, నిధుల దుర్వినియోగం, అవినీతి తేలితే బాధ్యులైన అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులపై కఠినమైన శాఖాపరమైన చర్యలతో పాటు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.
అంతేకాకుండా దుర్వినియోగమైన ప్రభుత్వ సొమ్మును మొత్తాన్ని, బాధ్యుల నుండి రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి చేసిన పనులు, ఖర్చుల లెక్కలను ప్రజల ముందు ఉంచాలని, సోషల్ ఆడిట్ నిర్వహించి పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని పలువురు కోరుతున్నారు.
ప్రజాధనం పరిరక్షణకు, వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని మర్రిగూడ మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు..