తమిళనాడులో ముస్లిం రిజర్వేషన్ల అంశం మళ్లీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మత మార్పిడి ద్వారా ఇస్లాం స్వీకరించిన వారికి వెనుకబడిన తరగతుల (బీసీ) కింద రిజర్వేషన్లు కల్పించడంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ వివాదానికి మూలం 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు. అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన ఆ ఉత్తర్వుల ప్రకారం, బీసీ, ఎంబీసీ, డినోటిఫైడ్ కమ్యూనిటీలు లేదా షెడ్యూల్డ్ కులాల నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించిన వారిని కూడా వెనుకబడిన వర్గాలుగా పరిగణించాలని నిర్ణయించింది. దీంతో ఆయా వర్గాలకు కమ్యూనిటీ సర్టిఫికేట్లు జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అన్సార్, లబ్బాయిస్, రౌథర్, మరకాయర్, మపిల్లా, షేక్, సయ్యద్ వంటి ముస్లిం వర్గాలు ఈ విధానంతో లబ్ధి పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అయితే ఈ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొట్టివేసింది. మత మార్పిడి జరిగినప్పటికీ వ్యక్తిని కేవలం మతపరంగా మాత్రమే గుర్తించవచ్చని, కానీ అతనికి బీసీ హోదా కింద రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. గతంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు ఇది వ్యతిరేకంగా ఉందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ జూలై 4, 2026న ఈ పిటిషన్ సమర్పించినట్లు సమాచారం. ఈ కేసు దేశవ్యాప్తంగా రిజర్వేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశమున్నందున సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మతం, సామాజిక వర్గాలు, రిజర్వేషన్ హక్కుల మధ్య ఉన్న ఈ సున్నితమైన అంశంపై అత్యున్నత న్యాయస్థానం తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.
also read: విషాదం: అంబులెన్స్ ఆలస్యంతో నలుగురు శిశువులు మృతి