Vikram-1 Rocket Launch: దేశంలో ప్రైవేటు రంగం నుంచి అంతరిక్ష ప్రయోగాలకు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సిద్ధమవుతోంది. సంస్థ తన తొలి ప్రయోగమైన ‘మిషన్ ఆగమన్’లో భాగంగా విక్రమ్-1 రాకెట్ ను త్వరలో అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
ఈ చారిత్రాత్మక ప్రయోగానికి ప్రత్యేకతను తీసుకురావడానికి స్కైరూట్ ఏరోస్పేస్ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి విశేష సేవలు అందించిన ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు సర్ సీవీ రామన్, భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ కళారూపాలను విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది.
ఈ ప్రత్యేక కళాఖండాలను ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ మట్టెవాడ రూపొందించారు. 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఈ సూక్ష్మ రూపాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కో కళారూపం బియ్యం గింజ కంటే కూడా చిన్న పరిమాణంలో ఉండటం విశేషం. అత్యంత సూక్ష్మంగా రూపొందించిన ఈ కళాఖండాలు భారత శాస్త్రవేత్తల సేవలకు గుర్తుగా అంతరిక్షంలోకి వెళ్లనున్నాయి.
‘మిషన్ ఆగమన్’ ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనున్నారు. జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య అనుకూల వాతావరణ పరిస్థితులను బట్టి ప్రయోగ తేదీని ఖరారు చేయనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, ప్రైవేటు రంగంలో స్వదేశీంగా అభివృద్ధి చేసిన రాకెట్‌ను కక్ష్యలోకి పంపిన తొలి భారతీయ సంస్థగా స్కైరూట్ ఏరోస్పేస్ చరిత్ర సృష్టించనుంది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను మరింత బలోపేతం చేసే ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అంతేకాదు, భారత శాస్త్రవేత్తలకు వినూత్నంగా నివాళి అర్పించే ప్రయత్నంగా కూడా ఈ మిషన్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.