హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినగానే సూపర్ హిట్ సినిమాలు, కుటుంబ కథలు, పంచ్ డైలాగులు గుర్తొస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా ఆయన తెరకెక్కించిన దాదాపు ప్రతి సినిమాకూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతోంది. ఒకప్పుడు కథల విషయంలో వచ్చిన ఆరోపణల నుంచి, ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న కొత్త సినిమాపై సోషల్ మీడియాలో మొదలైన చర్చల వరకు గురూజీ సినిమాలు విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తున్నాయి. 2016లో విడుదలైన అ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, యద్దనపూడి సులోచనారాణి రచించిన మీనా నవల ఆధారంగా కథ ఉందని, సరైన క్రెడిట్ ఇవ్వలేదనే విమర్శలు వచ్చాయి. అనంతరం త్రివిక్రమ్ స్పందిస్తూ రచయిత్రి అనుమతితోనే సినిమా రూపొందించామని వివరణ ఇవ్వడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
Also Read:ఉద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఖాతాల్లోకి వడ్డీ జమ
అయితే 2018లో వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం త్రివిక్రమ్ కెరీర్‌లో అతిపెద్ద వివాదంగా నిలిచింది. ఫ్రెంచ్ చిత్రం Largo Winch కథను పోలి ఉందని ఆరోపణలు రావడమే కాకుండా, ఆ సినిమా దర్శకుడు కూడా సోషల్ మీడియాలో స్పందించడం పెద్ద చర్చకు దారితీసింది. అదే ఏడాది విడుదలైన అరవింద సమేత పై కూడా ఒక రచయిత తన కథను పోలి ఉందని ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాపైనా కొన్ని పోలికల వ్యాఖ్యలు వినిపించినప్పటికీ, అవి పెద్ద వివాదంగా మారలేదు. ప్రస్తుతం వెంకటేష్‌తో తెరకెక్కిస్తున్న సినిమాపై కూడా కథ విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై ఎలాంటి అధికారిక స్పందన లేదు.
Also Read:నిజామాబాద్‌లో దారుణం….! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య…!
ఇక తాజాగా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ప్రకటన మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కార్తికేయ స్వామికి సంబంధించిన పోస్టర్‌లో నిర్మాణ సంస్థ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశం రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై త్రివిక్రమ్ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. గతంలోలాగే ఈసారి కూడా మౌనం పాటిస్తున్నారు. అయితే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించినప్పటికీ, విడుదలకు ముందు లేదా తర్వాత ఏదో ఒక వివాదం వెంటాడటం మాత్రం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులు మాత్రం వివాదాల కంటే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.