క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ : పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ.. ఓ విద్యార్థిని పట్ల మానవత్వం చూపారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలికను భుజంపై ఎత్తుకుని సుమారు 6 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్యం అందేలా చేసి విద్యార్థిని ప్రాణాన్ని కాపాడారు. ఈ విషయమై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందిస్తూ.. వార్డెన్ హేమను అభినందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమెపై ప్రశంసలు కురిపించారు. సేవాభావంతో పనిచేసే మీలాంటి అధికారులు.. ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని కొనియాడారు.
‘మానవత్వం, సేవాభావం, విధి పట్ల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమకు హృదయపూర్వక అభినందనలు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిని తన భుజాలపై మోస్తూ కొండలు, గుట్టల మీదుగా సుమారు 6 కిలోమీటర్లు నడిచి సకాలంలో వైద్యం అందేలా చేసి ఆ బాలిక ప్రాణాన్ని కాపాడిన మీ సేవాస్ఫూర్తి, మానవత్వం, నిబద్ధత నిజంగా అభినందనీయం. విధి అనేది కేవలం బాధ్యత కాదని, దానికి మానవత్వం తోడైతే ఒక ప్రాణాన్ని కూడా కాపాడవచ్చని మీరు నిరూపించారు. మీలాంటి సేవాభావం, అంకితభావంతో పనిచేసే అధికారులు.. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలి. సమాజంలో మరెందరో ఇలాంటి స్ఫూర్తితో ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ.. వార్డెన్ హేమకు మరోసారి హృదయపూర్వక అభినందనలు’ అని ఎక్స్‌లో రాయపాటి శైలజ రాసుకొచ్చారు.