HomeజాతీయంFuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు!

Fuel Prices: పెట్రోల్ ధరల తగ్గింపు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయనే ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు. ప్రస్తుతం ఇంధన ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అధిక ధరలకు చమురును కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే ముడి చమురును శుద్ధి చేసి దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్నాయని చెప్పారు. అందువల్ల అంతర్జాతీయంగా ప్రస్తుతం చమురు ధరలు తగ్గినా, దాని ప్రభావం వెంటనే దేశీయ ఇంధన ధరలపై కనిపించదని వివరించారు.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని వారాలుగా ముడి చమురు ధరలు పెరిగాయని, దీని ప్రభావంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 నాటికి సుమారు రూ.74 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని మంత్రి వెల్లడించారు.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయంటూ విలేకరులు ప్రశ్నించగా, మరో రెండు నుంచి మూడు నెలల పాటు ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో తక్కువగా కొనసాగితే అప్పుడు ఈ అంశంపై చర్చించడం సమంజసమని హర్దీప్ సింగ్ పురీ అన్నారు. అంతేకాకుండా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే దాదాపు 20 శాతం వరకు పెరిగాయని చెప్పారు. అలాగే భారత్‌కు పొరుగున ఉన్న కొన్ని దేశాల్లో ఇంధన ధరలు సుమారు 35 శాతం వరకు పెరిగినట్లు తెలిపారు.

భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం 5.58 శాతం మేర మాత్రమే పెరిగాయని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముడి చమురు కొనుగోలు ధరలు, ఆయిల్ కంపెనీల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు.

 

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు