HomeజాతీయంNEET UG Exam: ఒకే రోజు పరీక్షకు గుడ్‌ బై.. నీట్ పరీక్షలో భారీ మార్పులు!

NEET UG Exam: ఒకే రోజు పరీక్షకు గుడ్‌ బై.. నీట్ పరీక్షలో భారీ మార్పులు!

దేశంలో వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఇటీవల ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రస్తుత విధానాన్ని సమీక్షించాలని సూచించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే రోజు నీట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి కాకుండా, పలు దశల్లో పరీక్ష నిర్వహించే విధానాన్ని పరిశీలించాలని కమిటీ ప్రతిపాదించింది. ఇలా చేస్తే పరీక్ష కేంద్రాల నిర్వహణ, భద్రత, అభ్యర్థుల రవాణా, ఇతర ఏర్పాట్లపై ఉండే ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ అంశాలపై ముకుల్ వాస్నిక్ నేతృత్వంలోని విద్య, మహిళ, శిశు అభివృద్ధి, యువజన, క్రీడల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యే అతిపెద్ద ప్రవేశ పరీక్షల్లో నీట్ ఒకటిగా ఉండటంతో, దీనిని మరింత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించే మార్గాలపై కమిటీ దృష్టి సారించింది.

అలాగే ప్రస్తుతం ఎంబీబీఎస్, ఆయుష్, నర్సింగ్ వంటి కోర్సులన్నింటికీ ఒకే నీట్ పరీక్ష నిర్వహిస్తున్న విధానాన్ని కూడా కమిటీ సమీక్షించింది. ఈ కోర్సులకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు పరీక్షల నిర్వహణ కూడా సులభమవుతుందని సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

పరీక్షా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని కమిటీ సూచించింది. సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తూ పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

నీట్ పరీక్ష నిర్వహణలో మార్పులపై కమిటీ చేసిన ఈ సూచనలను కేంద్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్పులు అమల్లోకి వస్తే భవిష్యత్‌ లో నీట్ పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు కనిపించే అవకాశముంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు