ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో భారీ విషాదం తృటిలో తప్పింది. ఒక వ్యక్తి వేలాది మందిని లక్ష్యంగా చేసుకుని విషపు క్యాప్సూల్స్ పంపిణీ చేయాలని ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. అయితే, ముగ్గురు మహిళా వాలంటీర్లు, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శుక్రవారం జరిగిన అషురా ఊరేగింపు రీయే రోడ్‌లోని రహమతాబాద్ శ్మశానవాటిక వద్దకు చేరుకున్న సమయంలో భారీగా భక్తులు గుమిగూడారు. ఇదే, అవకాశంగా భావించిన ఫయాజ్ ప్రేమ్ జీ అనే వ్యక్తి రోగనిరోధక శక్తిని పెంచే మందులంటూ క్యాప్సూల్స్ ను పంపిణీ చేయడం ప్రారంభించాడు. అతడు మరికొందరి చేత కూడా వాటిని పంచించాడు.
అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ముగ్గురు మహిళా వాలంటీర్లు అతడిని ప్రశ్నించారు. క్యాప్సూల్స్ తీసుకున్న వారు వాటిని మింగొద్దని లౌడ్ స్పీకర్ ద్వారా కూడా హెచ్చరించారు. ప్రేమ్ జీ మాత్రం అవి ఆరోగ్యానికి ఉపయోగపడే మాత్రలేనని చెప్పాడు. అయినప్పటికీ అనుమానం తొలగకపోవడంతో వాలంటీర్లు క్యాప్సూల్స్ ను తెరిచి పరిశీలించారు. వాటిలో అనుమానాస్పద పదార్థం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో సల్మాన్ సయీద్ అనే వ్యక్తి ఒక క్యాప్సూల్ తీసుకోవడంతో వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డాడు. అతడితో పాటు మొత్తం 11 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకున్నారు.
సమాచారం అందుకున్న బైకుల్లా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫయాజ్ ప్రేమ్‌జీని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో కనీసం 15 వేల మందిని చంపాలనే ఉద్దేశంతో ఈ పని చేసినట్లు అతడు చెప్పినట్లు సమాచారం. పుణెలోని విమాన్‌నగర్‌కు చెందిన ప్రేమ్‌జీ బీబీఏ చదివి, పెయింటింగ్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఘటన వెనుక మరేదైనా పెద్ద కుట్ర లేదంటే ఉగ్రవాద కోణం ఉందా? అనే దిశగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మహిళా వాలంటీర్ల అప్రమత్తత వల్లే వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయని అధికారులు తెలిపారు.