తెలంగాణ పర్యాటక రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలను అమలు చేస్తోంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ప్రపంచానికి మరింత చేరువ చేసే లక్ష్యంతో తెలంగాణలోనే తొలి రోప్‌వే పర్యాటక ప్రాజెక్టును భువనగిరి కోట వద్ద అభివృద్ధి చేస్తున్నారు. వేల ఏళ్ల చరిత్రను సొంతం చేసుకున్న భువనగిరి ఖిల్లాను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలు చేపడుతోంది. రోప్‌వే నిర్మాణంతో పాటు ఆధునిక వసతులు కల్పించడం ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణను ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న పర్యాటక కేంద్రాలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తోంది. ఈ క్రమంలో భువనగిరి కోటకు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. సుమారు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోట తెలంగాణ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఏకశిలా పర్వత కోట సముద్ర మట్టానికి సుమారు 610 మీటర్ల ఎత్తులో ఉంది. 10వ నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు ఈ దుర్భేద్య కోట నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. పైభాగం నుంచి చూస్తే అండాకారంలో కనిపించడం ఈ ఖిల్లా ప్రత్యేకతగా గుర్తింపు పొందింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోటను ప్రత్యేకంగా ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా “భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్” అభివృద్ధి కోసం రూ.56.81 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి 165 నుంచి భువనగిరి కోట వరకు దాదాపు 1 కిలోమీటరు పొడవున రోప్‌వే నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో తొలి రోప్‌వే పర్యాటక కేంద్రంగా భువనగిరి ఖిల్లా చరిత్ర సృష్టించనుంది.
ప్రస్తుతం భువనగిరి కోటపైకి చేరుకోవడానికి సందర్శకులు సుమారు గంట సమయం పాటు మెట్ల మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. ట్రెక్కింగ్‌కు అనువైన ప్రాంతంగా ఇప్పటికే ప్రసిద్ధి చెందిన ఈ కోటకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించేందుకు రోప్‌వే నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు దఫాలుగా సుమారు 5 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించి నిర్వాసితులకు దాదాపు రూ.4 కోట్ల పరిహారం చెల్లించారు. ఇప్పటికే బేస్ క్యాంప్ నిర్మాణం, రోప్‌వే స్తంభాల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేస్తూ అవసరమైన ప్రాంతాల్లో కొత్త మెట్ల నిర్మాణం చేపడుతున్నారు. కోటలోని ద్వారాలు, చారిత్రక కట్టడాలకు మరమ్మతులు నిర్వహించడంతో పాటు సంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కోట సమీపంలో ఆధునిక సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. బేస్ క్యాంప్ వద్ద ఆహార కేంద్రాలు, పచ్చదనంతో కూడిన విశ్రాంతి ప్రాంతాలు, పార్కింగ్ సదుపాయాలు, విశ్రాంతి గదులు, పిల్లల ఆట స్థలాలు, పర్యాటక సమాచారం కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండ రహదారి నుంచి కోటకు వెళ్లే ప్రధాన మార్గాన్ని కూడా ఆధునికీకరించనున్నారు. అంతేకాకుండా సుమారు రూ.30 కోట్ల వ్యయంతో వివాహ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక వేదికలు, ఇతర ఆకర్షణీయ నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
భువనగిరి కోట వద్ద జరుగుతున్న పనులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా పరిశీలించారు. రోప్‌వే, హోటల్, పార్కింగ్, విశ్రాంతి గదులు, కేఫెటేరియా, కోట పునరుద్ధరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబగళ్లు పనులు నిర్వహించి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కోట చారిత్రక ప్రాముఖ్యతకు ఎలాంటి భంగం కలగకుండా ఆధునిక సౌకర్యాలను సమన్వయం చేయాలని స్పష్టం చేశారు.
ఈ రోప్‌వే అందుబాటులోకి వస్తే గంటకు సుమారు 300 మంది పర్యాటకులు కోటపైకి చేరుకునే అవకాశం ఉంటుంది. సెకనుకు 6 మీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ వ్యవస్థ సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది. భవిష్యత్తులో యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక పర్యాటక సర్క్యూట్‌ను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రణాళిక అమలైతే ఒకే ప్రాంతంలో ఆధ్యాత్మికత, వారసత్వం, ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం దేశీయ, విదేశీ పర్యాటకులకు లభించనుంది. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, నాగార్జునసాగర్ బుద్ధవనం, అనంతగిరి కొండలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.