HomeజాతీయంAgricultural Loans: రైతులకు సులభంగా రుణాలు.. రూ.2 లక్షల వరకు తాకట్టు అవసరం లేదు!

Agricultural Loans: రైతులకు సులభంగా రుణాలు.. రూ.2 లక్షల వరకు తాకట్టు అవసరం లేదు!

దేశంలోని రైతులకు వ్యవసాయ రుణాలు సులభంగా అందేలా చేయడానికి  ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రైతులు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడంతో పాటు, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపు విధానాల్లో దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు ఉండేలా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు బ్యాంకు రుణాలు పొందడం మరింత సులభం కానుంది.

రూ.2 లక్షల వరకు తాకట్టు అవసరం లేదు

కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్వల్పకాలిక పంటల కోసం రుణ కాలాన్ని 12 నెలలుగా నిర్ణయించారు. అలాగే దీర్ఘకాలిక పంటల విషయంలో ఈ కాలాన్ని 18 నెలలుగా ఖరారు చేశారు. దీని వల్ల రైతులు పంటల స్వభావాన్ని బట్టి రుణాలను సౌకర్యవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, వ్యవసాయం, దానికి అనుబంధ రంగాల కోసం రైతులు తీసుకునే రూ.2 లక్షల లోపు రుణాలపై తాకట్టు, మార్జిన్ మనీ, అదనపు భద్రత వంటి నిబంధనలను తొలగించారు. ఇప్పటి వరకు ఈ సడలింపు కేవలం రూ.1.60 లక్షల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు పరిమితిని రూ.2 లక్షలకు పెంచడం రైతులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు.

పశుసంవర్థక రంగంపై రూ.3 లక్షల వరకు తాకట్టు మినహాయింపు

ఇక పశుసంవర్థక రంగానికి సంబంధించిన రుణాల విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.3 లక్షల వరకు రుణాలపై తాకట్టు మినహాయింపు ఇచ్చే అవకాశాన్ని బ్యాంకులకు కల్పించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం ఆయా బ్యాంకుల అంతర్గత రుణ విధానాల ఆధారంగా ఉంటుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు చిన్న, మధ్య తరహా రైతులకు ఎంతో ఉపయోగపడతాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ పత్రాలు, తక్కువ నిబంధనలతో రుణాలు పొందే అవకాశం ఉండటంతో రైతులకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు