క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నిజామాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు నెలల చిన్నారిని కన్నతండ్రే అత్యంత దారుణంగా నరికి చంపడం సంచలనం సృష్టిస్తోంది. భార్యపై అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడటం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని నయాగావ్‌కు చెందిన యువరాజ్, నిజామాబాద్‌లోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ప్రియాంక ఏడాది కిందట వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలపాటు వారి బంధం అన్యోన్యంగా సాగింది. ఆ తర్వాత ప్రియాంకపై యువరాజ్ అనుమానం పెంచుకోవడం ప్రారంభించాడు. ప్రియాంకను అనుమానిస్తూ ప్రతిరోజూ వేధించడం మెుదలుపెట్టాడు. మరోవైపు ఆమె గర్భం దాల్చడంతో వేధింపులు మరింత పెరిగాయి. ఇటీవల పుట్టింటికి వచ్చిన బాధిత తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, చిన్నారి తనకు పుట్టలేదంటూ ప్రియాంక కుటుంబ సభ్యులతో పలుమార్లు యువరాజ్ గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలోనే జూన్ 17న చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో బాలుడిని కత్తితో పలుమార్లు నరికి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రైల్వే పట్టాల పక్కన పడేసి పరారయ్యాడు. సాయంత్రం అయినా భర్త, కుమారుడు ఇంటికి రాకపోవడంతో పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టి నేడు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి మృతితో ప్రియాంక, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.