క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది పెన్షన్లు రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.28 లక్షల పెన్షన్లు రద్దు అయినట్టు తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఒకసారి భారీ సంఖ్యలో పెన్షన్లు కోతకు గురైనట్టైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించింది. ఇందులో భాగంగా అనర్హుల ఏరివేత ప్రక్రియను చేపట్టింది. మొత్తంగా 1.28 లక్షల పెన్షన్లు రీ వెరిఫికేషన్ ప్రక్రియ తరువాత రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో మృతులు, అందుబాటులో లేని వాళ్లు, వలస వెళ్లినవాళ్లు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, ఐదు ఎకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉన్న వాళ్లు, టాక్స్ పేయర్స్ ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం వారి పెన్షన్లను రద్దు చేసింది. వీటిలో 1.02 లక్షల గ్రామాల్లో ఉన్న పెన్షన్లు కాగా, మిగిలి 26 వేలు పెన్షన్లు మున్సిపాలిటీల్లో ఉన్నవిగా గుర్తించారు. ఒకేసారి వేలాది పెన్షన్లు రద్దు కావడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్నేళ్ల నుంచి పెన్షన్లు పొందుతున్న వారంతా వాటిని కోల్పోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పెన్షన్లు మంజూరు..
అనర్హుల ఏరివేత ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం కొత్త వారికి పెన్షన్లు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. కొద్దిరోజుల్లోనే అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు అనుగుణమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కొత్త పెన్షన్లు మంజూరుకు వీలుగా ఇప్పటికే అధికారులు 48 వేల మంది వికలాంగులు, వితంతువులు జాబితాను సిద్ధం చేశారు. వీరికి కొద్దిరోజుల్లోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. అలాగే, ఇప్పటికే తొలగించిన పెన్షన్లు జాబితాలో అర్హులైన వారు ఉంటే వారికి మరో అవకాశాన్ని కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అర్హత ఉండి పెన్షన్ తొలగింపునకు గురైతే వారంతా మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు రద్దు చేసిన పెన్షన్లను పూర్తిగా పరిశీలించిన తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా ఒకేసారి వేలాది పెన్షన్లు రద్దు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.