సంబంధాల్లో నమ్మకం లేకపోతే చిన్న చిన్న విభేదాలు కూడా పెద్ద విషాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘటన ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. తన ప్రియురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.
అసలేం జరిగిందంటే?
సిక్కింకు చెందిన 22 ఏళ్ల అటి హంగ్మా సుబ్బ బెంగళూరులోని ఒక సెలూన్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. డార్జిలింగ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల పూర్బా లెప్చా ఒక హోటల్‌లో వెయిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుమారు నెల రోజుల క్రితం ఉద్యోగాల కోసం ఇద్దరూ బెంగళూరుకు వచ్చారు. నగరంలోని దొడ్డకన్నహళ్లి ప్రాంతంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఇటీవల హంగ్మా ప్రవర్తనపై పూర్బాకు అనుమానాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని భావిస్తూ తరచూ గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు.
అనుమానాలు.. గొడవలు..
ఈ అనుమానాల కారణంగా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం కూడా అదే అంశంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో పూర్బా తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. వంటగదిలో ఉన్న కత్తిని తీసుకుని హంగ్మాపై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. గొంతు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బెల్లందూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తులో సేకరిస్తున్నారు.