Homeతెలంగాణవెంగళరావునగర్ భూవివాదం.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా

వెంగళరావునగర్ భూవివాదం.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ కట్టడాల కూల్చివేతలతో హాట్ టాఫిక్‌గా మారిన హైడ్రాకు ఈసారి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం, గడువులోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ వెంగళరావునగర్‌లో సర్వే నం.45లోని రెండెకరాల వివాదాస్పద భూమికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలన్న ఆదేశాలు అమలు చేయని కారణంగా హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెనాల్టీ మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి సహాయ నిధికి చెల్లించిన తరువాతే వారి కౌంటర్లను రికార్డుల్లోకి స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీని స్పష్టంగా ఆదేశించింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. వెంగళరావునగర్‌లోని సర్వే నం.45 పరిధిలోని భూమిపై గతంలోనే స్టేటస్ కో కొనసాగించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఈ ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ మార్చి 18న హైడ్రా బృందాలు అక్కడికి చేరుకుని కాంపౌండ్‌ వాల్‌ను కూల్చివేయడమే కాకుండా.. అది హైడ్రా పరిధిలోని భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశాయి. కోర్టు ఆదేశాల ఉల్లంఘనను సవాలు చేస్తూ బాధితుడు మహమ్మద్‌ షఫహతుల్లా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి గతంలో వేర్వేరుగా దాఖలైన పిటిషన్‌లపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌.. ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించారు. అయినప్పటికీ హైడ్రా స్పందించకపోవడంతో గత ఏప్రిల్‌ 8న చివరిగా మరో అవకాశం ఇచ్చారు. తదుపరి విచారణ నాటికి కౌంటర్లు వేయకపోతే హైడ్రా కమిషనర్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుందని కూడా అప్పట్లో హెచ్చరించారు. ఇటీవల ఈ అంశం మళ్లీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ వద్దకు విచారణకు వచ్చింది.

ఈసారి కూడా హైడ్రా తరఫున సరైన సమాధానం రాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తాము ఇప్పటికే కౌంటర్లు దాఖలు చేశామని.. అవి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై న్యాయమూర్తి స్వయంగా పరిశీలించగా.. హైడ్రా దాఖలు చేసిన కౌంటర్లలో అనేక లోపాలు ఉండటం వల్ల, సాంకేతిక కారణాలతో రిజిస్ట్రీ వాటిని ముందే తిరస్కరించిందని తేలింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులను, హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం సమర్థనీయం కాదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీంతో ఈ పిటిషన్‌లపై తుది విచారణను ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో హైడ్రా కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ సదరు మొత్తాన్ని సీజే సహాయ నిధికి జమ చేసి ఆ రశీదును సమర్పించిన తర్వాతే వారి కౌంటర్లను అధికారికంగా స్వీకరించాలని రిజిస్ట్రీకి కఠిన ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు

hello world